ప్రధాని మోదీ ట్వీట్‌కు స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. కరోనాపై ప్రత్యేక గీతం రూపొదించి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తున్న తెలుగు హీరోలు నాగార్జున, చిరంజీవి,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌ని మోదీ తన ట్విట్టర్ ద్వారా అభినందించిన విషయం తెలిసిందే. అందర్నీ అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు. అయితే మోదీ ట్వీట్ పై తాజాగాచిరు స్పందించారు. ‘శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.కరోనా క్రైసిస్ వలన మన దేశానికి జరగిన నష్టాన్ని తగ్గించడానికి మీరు చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మీరు చేపడుతున్న భారీ యజ్ఞంలో భాగంగా మా వంతు కృషి చేసాము. సంగీత దర్శకుడు కోటి గారు, మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు’ అంటూ చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మోదీ శుక్రవారం తెలుగు తారల్ని అభినందించారు. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు . అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం, అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామని మోదీ తన ట్వీట్‌లో తెలుగులో రాసారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు టాలీవుడ్ నడుం బిగించింది. ఇందుకోసం సంగీత దర్శకుడు కోటి ఓ ప్రత్యేక గీతాన్ని ట్యూన్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఆలపించారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ… వైరస్ నిర్మూలనకు చేయాల్సిన కృషిని పాట రూపంలో రూపొందించారు. ఎవరి ఇంటిలో వారు ఉంటూ పాట పాడి రికార్డ్ చేశారు.