మెంటల్‌ మదిలో… తెలుగు బులెట్ రివ్యూ

Mental Madhilo Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  శ్రీవిష్ణు, నివేత 

నిర్మాత:   రాజ్ కందుకూరి
దర్శకత్వం :  వివేక్ ఆత్రేయ 

మ్యూజిక్ : ప్రశాంత్  ఆర్  విహారి 

పెళ్లిచూపులు వంటి చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ సాధించిన నిర్మాత రాజ్ కందుకూరి మరోసారి కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయను వెండితెరకు పరిచయం చేస్తూ చేసిన సినిమా మెంటల్ మదిలో. ఇక ఇందులో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు నివేద , అమృత శ్రీనివాసన్ . ఓ సక్సెస్ ఫుల్ సినిమా వచ్చాక నిర్మాత మీద అంచనాలు పెరుగుతాయి. ఆయన జడ్జిమెంట్ కు సంబంధించి చాలా ఒత్తిడి పడుతుంది. మధ్యమధ్యలో పాత సినిమా తాలూకా విజయపు ఉత్సాహం బయటకు తొంగిచూస్తుంది. వీటి అన్నిటి మధ్య కొత్త సినిమా చేయడం ఏ నిర్మాతకు అయినా కత్తి మీద సామే. ఇప్పుడు అలాగే పెళ్లిచూపులు నిర్మాత “మెంటల్ మదిలో “ తో చేసిన కత్తి మీద సాము ఎలా వుందో చూద్దాం.

కథ…

ఏమి చేయాలి అనే విషయంలో ప్రతిదానికి కన్ఫ్యూజ్ కావడం అరవింద్ కృష్ణ కు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఐటీ లో పనిచేసే ఇతగాడికి అమ్మాయిలు అంటే ఆమడ దూరం వెళ్లే అలవాటు అడిషనల్ క్వాలిఫికేషన్. ఇలాంటి అరవింద్ కి పూర్తిగా ఆధునిక భావాలు,జీవితం మీద స్పష్టత వున్న స్వేచ్ఛ తో పెళ్లి కుదురుతుంది. భిన్న ధృవాల్లాంటి ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఇక ఎంగేజిమెంట్ అనుకోగానే ఓ అనుకోని కారణంతో అది వాయిదా పడుతుంది. ఇంతలో ఆఫీస్ పని మీద ముంబై వెళ్లి వచ్చిన అరవింద్ స్వేచ్ఛని పెళ్లి వద్దని చెబుతాడు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి, చివరకు వాళ్ళు కలిసారా లేదా అన్నదే మెంటల్ మదిలో సినిమా.

విశ్లేషణ ….

మాథెమాటిక్స్ కి ఫార్ములా ఉన్నట్టు తెలుగు సినిమాను కూడా ఓ మూసలో నడిపిస్తున్న వాళ్లకు “ మెంటల్ మదిలో “ చూపించి తీరాలి. దర్శకుడు వివేక్ ఆత్రేయ కు తెలుగు భాష మీద, మధ్య తరగతి జీవితాలు, యువత భావోద్వేగాల మీద పట్టు అపారం అని ఈ సినిమా చూస్తే చెప్పేయొచ్చు. కథ, దానికి తగ్గ కధనం తప్ప ఎక్కడా సినిమాటిక్ పోకడ లేదు. ఒక్క అసహజ డైలాగ్ రాదు. ఎక్కడా ట్విస్ట్ ఉండదు. కానీ ప్రేక్షకుడు ఎక్కడా ఇంకోవైపు తన మైండ్ పెడదామన్నా పెట్టలేడు.

కొత్తదనం కోరుకునే ప్రేక్షకుడికి కొత్త కధలు దొరకడం లేదని సమాధానం చెప్పే సినీ జీవులకు మామూలు జీవితాలు, మన చుట్టూ తిరిగే కుర్రోళ్ళ మనసుల్లో సంఘర్షణను కూడా సినిమాగా తీయొచ్చని నిరూపించాడు ఆత్రేయ.

ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ. యూత్ ఫుల్ మూవీ అంటే యూత్ ఫుల్ మూవీ . ఫ్యామిలీ కధ అంటే ఫామిలీ స్టోరీ. మొత్తంగా మనం రోజు చూసే జీవితాన్ని కొత్త కోణంలో టచ్ చేసి చూపిన సినిమా మెంటల్ మదిలో. మనసు చేసే చిత్రాలు ఎలా వుంటాయో ఈ సినిమాలో భలేగా చూపించారు. దర్శకుడుకి ఇది తొలి సినిమా అంటే నమ్మబుద్ధి కాదు. తెలుగు సినిమాకు ఆత్రేయ రూపంలో ఇంకో ఆణిముత్యం దొరికింది. ఇందులో నో డౌట్.

ఇక శ్రీవిష్ణు సినిమా సినిమాకు ఓ నటుడుగా తన రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. సినిమాలో అరవింద్ తప్ప శ్రీవిష్ణు కనిపించదు. ఈ సినిమాలో అతని గురించి ఇంతకు మించి చెప్పడం అనవసరం. ఇక హీరోయిన్ గా చేసిన నివేద పేతురాజ్ సహజనటి. స్వేచ్ఛ తప్ప తాను కనపడకుండా చేసింది. అమృత శ్రీనివాసన్ చేసిన పాత్ర తో పాటు శివాజీ రాజా కూడా ఈ సినిమా చూసాక గుర్తుకు వస్తూనే వుంటారు.

కెమెరా పనితనం, మ్యూజిక్ కూడా మెంటల్ మదిలో సినిమాకు అదనపు బలం. ఇక నిర్మాత అంటే కాంబినేషన్ సెట్ చేయడం,లెక్కలు వేయడం, మార్కెటింగ్, థియేటర్స్ చూసుకోవడం అన్న విషయాలకు పరిమితం అవుతున్న ఈ రోజుల్లో రాజ్ కందుకూరి భిన్నంగా నిలిచారు . టీం సెలక్షన్ తో పాటు వారికి మార్గదర్శకుడిగా నిలవడం లో తనదైన మార్క్ చూపారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇలాంటి నిర్మాతలు పది మంది ఉంటే తెలుగు సినిమా తలెత్తుకు తిరుగుతుంది.

ప్లస్ పాయింట్స్ …
మెంటల్ మదిలో సినిమా మొత్తం, అందుకోసం పనిచేసిన అందరు.

మైనస్ పాయింట్స్ …
భూతద్దానికి పనితప్ప ఫలితం లేదు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ …”మెంటల్ మదిలో “ టైటిల్ సినిమా రేంజ్ లో లేదబ్బా.
తెలుగు బులెట్ రేటింగ్ … 4 /5 .