ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పోలీసులపై తీవ్ర్ స్థాయిలో మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో తన అనుచరుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అఖిలప్రియ అనుచరులతో పాటు పలువురి ఇళ్లపై నంద్యాల పోలీసులు అర్ధరాత్రి దాడులు జరిపారు. దీంతో ఈ విషయాన్ని అనుచరులు మంత్రి అఖిలప్రియకు చెప్పడంతో ఆమె వెంటనే అధికారులకు ఫోన్ చేశారు. ఈ తనిఖీలు ఎవరు చేయమని ఆదేశించారని ప్రశ్నించగా ఉన్నతాధికారులు చెప్పడంతోనే తాము తనిఖీలు చేశామని పోలీసులు వెల్లడించారు. అందరి ఇళ్లలోనూ ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టామని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ వివరణకు తృప్తి చెందని అఖిలప్రియ పోలీసుల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేస్తూ తన గన్ మెన్లను వెనక్కు పంపించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించారు.
అయినా శాంతించని అఖిలప్రియ. జన్మభూమి కార్యక్రమంలో తనకు రక్షణగా రావొద్దని స్థానిక పోలీస్ అధికారులకు చెప్పారు. అయినప్పటికీ మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడకు రావడంతో అఖిలప్రియ వారిపై మండిపడ్డారు. అయితే తమా విధిగా నరసాపురంలో మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు దూరంగా నిలబడి బందోబస్తు చేశారు. అలాగే ఆమె పోలీసు బందోబస్తు లేకుండానే గలమర్రి, రుద్రవరం మండలాల్లో పర్యటించారు. ఈ నేపధ్యంలో తనను టార్గెట్ గా చేసుకుంటున్నారని భావించిన అఖిలప్రియ అధిష్టానానికి తన నిరసనను తెలియజేయడానికే గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు అఖిలప్రియతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.