ఒక్కోసారి తెలంగాణా మంత్రుల వ్యాఖ్యలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కానీ పరిస్థితి, అదేదో ఇద్దరు పిల్లలున్న తల్లి పెద్దోడికి ఏమో కొనిస్తే నాకూ అదే కావాలని చిన్నోడు మారం చేసినట్టు ఇప్పుడు వ్యాఖ్యానిస్తానున్నారు. తాజాగా తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల తెలంగాణా భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ హరీష్ రావు ఈ విధమైన వ్యాఖలు చేశారు. అబద్ధాలు ఆడడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు.
9 డిసెంబరు 2009 తేదిన తెలంగాణ ప్రకటించి, డిసెంబరు 23 తేదిన తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని మాట ఇచ్చి తప్పడం వారికేమీ కొత్త కాదని వారు అలా చేయడం వల్లే తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని హరీష్ విమర్శించారు. వారి ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా..? అని హరీష్ ప్రశ్నించారు. సీడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని అన్నారు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.