కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించేందుకు వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. తన అనుచరులతో కలిసి పంప్ హౌస్‌లోని లిఫ్ట్ ఎక్కిన ఆయన ప్రమాదవశాత్తు అందులో చిక్కుకున్నారు. సామర్థ్యానికి మించి ఎక్కడంతో లిఫ్ట్ స్తంభించిపోయింది. పైకి వస్తున్న క్రమంలో 1వ ప్లోర్ వద్ద సాంకేతిక లోపంతో నిలిచి పోయింది. పరిమితికి మించి 13 మంది ఎక్కడంతో పనిచే యక మధ్యలోనే నిలిచి పోయింది. ఇంజనీరింగ్ అధికారు లు, టెక్నికల్ సిబ్బంది లిప్టును రన్ చేయడానికి సర్వశక్తులు ఒడ్డినా కూడా ఫలితం లేకుండా పోయింది. సుమారు గంట పాటు అధికారులు, సిబ్బంది తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఎదుర్కొన్నారు. కాగా లిప్టులో భూపాలపల్లి ఆర్డీఓ వెంకటా చారి, మహాదేవపూర్ తహసీల్దార్ విజయనందం, మంత్రి గన్మెన్లు , కుటుంబ సభ్యులు ఉన్నారు. అధికారులు లిఫ్ట్ తలుపుల అద్దాలు పగులగొట్టి మంత్రితో పాటు ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.