Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతల వాగాడంబరం కోటలు దాటుతోంది. నిజానికి సొంత బలంతో ఓట్లు ,సీట్లు రావని పాపం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. టీడీపీ సాయంతో పదవులు తీసుకుని ఆ పార్టీ అధినేత చంద్రబాబుని ఇరుకున పెట్టేలా మాట్లాడి ఏదో సాధిద్దాం అనుకునే వారిలో టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు ముందు వరసలో వుంటారు. మంత్రి మాణిక్యాలరావు కాస్త సంయమనంతో వుంటారు అన్నది నిన్నమొన్నటిదాకా వున్న అభిప్రాయం. కానీ ఈ మధ్య మంత్రి మాణిక్యాలరావు మాటలు చూస్తుంటే అన్నీ వున్న విస్తర అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని విస్తర ఎగిరెగిరిపడుతుంది అన్న సామెత గుర్తొస్తోంది. స్థానిక రాజకీయాలను రాష్ట్రంతో ముడిపెట్టి నన్ను కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ని కట్ చేస్తా అనే స్థాయిలో ఆయన మాట్లాడ్డం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డం పడి మీరు ఏమి సాధిస్తారు. ఏ జనం అభివృద్ధిని అడ్డుకుంటారో వారి దగ్గరికి ఏ మొహంతో వెళతారు ? వారికి ఏమని సమాధానం చెబుతారు?
పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు తో వున్న విభేదాలతోనే మంత్రి మాణిక్యాలరావు ఇలా మాట్లాడారని రాష్ట్రం అంతా తెలుసు. వెంకట రామన్న గూడెం లో ఏ ప్రారంభోత్సవానికైనా నన్ను పిలిచారా అంటూ మంత్రి మాణిక్యాలరావు ఆవేదన చెందడంలో అర్ధం వుంది. కానీ ఆ కోపాన్ని రాష్ట్రం మొత్తం మీద చూపిస్తా అంటే జనం ఊరుకోరు. బాపిరాజుతో తేల్చుకోవాల్సిన అంశం లేదా టీడీపీ , బీజేపీ అధిష్టానాలతో మాట్లాడుకోవాల్సిన అంశంలో మొత్తం ఏపీ నే టార్గెట్ చేస్తాను అనే మంత్రులు ఉండటం రాష్ట్ర దురదృష్టం.
ఇటీవల గజల్ శ్రీనివాస్ విషయంలో ఇలాగే తొందరపడి మాట్లాడి ఆపై క్షమాపణ చెప్పిన మాణిక్యాలరావు ఇప్పుడు కూడా ఏపీ ప్రజల మనోభావాలను గుర్తించి చేసిన వ్యాఖ్యలకు విచారం ప్రకటిస్తే మేలు. అయినా ఆవేశంలో మాటలు హద్దులు దాటడం తప్ప ఓ మంత్రి ఓ మొత్తం రాష్ట్రాన్ని కట్ చేసే స్థాయిలో వుంటారా? జన బలం లేకుండా ఢిల్లీ ని నమ్ముకుని దూకుడుగా మాట్లాడితే అసలుకే ఎసరు వస్తుంది. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఎన్టీఆర్ , చంద్రబాబుని చూసి ఏపీ ని ఏదో చేద్దాం అనుకుని ఏమి అయిపోయారో నిత్యం కాంగ్రెస్ తప్పిదాల్ని వేలెత్తి చూపే మీకు వేరే చెప్పాలా ? అయినా ఈ మధ్య బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే జనబలం లేకుంటేనే వీళ్ళు ఇలా వున్నారు .ఇక కాసిని సొంత ఓట్లు ఉంటే ఇంకెలా వుండేవాళ్ళో అని జనం అనుకుంటున్నారు. ఈ మాటలు భవిష్యత్ లో ఓట్లు అవుతాయి. అస్త్రాలు కూడా అవుతాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ని కట్ చేసి ఎక్కడకి వెళతారు మంత్రిగారు. ఎలా బతుకుతారు ? ఈ ఆంధ్రప్రదేశ్ ఉండబట్టే మీకు బీజేపీ సీట్ ఇచ్చింది. జనం ఓట్లు వేస్తే మీరు గెలిచింది. సీఎం చంద్రబాబు మీకు మంత్రి పదవి ఇచ్చింది. ఆ ఆంధ్రప్రదేశ్ ని కట్ చేస్తే మాణిక్యాలరావు ని ఎవరూ గుర్తించరు. కాదంటారా ?