వారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు !

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకొని ముందస్తు డ్రామాకు తెరతీశారని బీజేపీకి మేలు చేసే ఉద్దేశంతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ అర్ధాంతరంగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అక్రమ సంబంధం ఉందని నారా లోకేశ్ సంచలనం రేపారు. బీజేపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఎంఐఎం తమ మిత్రపక్షమని కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ‘అయినా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పెళ్లి సంబంధమైతే గోత్రాలు కావాలిగానీ అక్రమ సంబంధమైతే గోత్రాలతో పనేంటి’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

Minister Nara Lokesh Sensational Comments on CM KCR

 

గడువు తీరకముందే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని లోకేశ్ ప్రశ్నించారు. ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దగ్గర ఏముందని ప్రశ్నించారు. తెలంగాణలో ఐటీ, పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలు కూడా లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో నిరుద్యోగ భృతి ఇస్తారని అనుకున్నాం. కానీ ఇవ్వలేదు. రైతు బంధు పథకం వల్ల కౌలు రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని ఆయన అన్నారు.

CM KCR And Modi

బీజేపీతో కలవనని చెబుతూనే కేసీఆర్ ఆ పార్టీ స్క్రిప్ట్‌ ప్రకారమే నడుస్తున్నట్టు ఉందని లోకేశ్ అన్నారు. విభజన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న లోకేశ్‌ కేసీఆర్‌ అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎంలకే సమయం ఇవ్వని ప్రధాని కేటీఆర్‌కు మాత్రం ఇచ్చారని ఆరోపించారు. ‘ప్రీపోల్‌ అలయన్స్‌ పెట్టుకున్న టీడీపీకి, ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాత్రం కేంద్రం సహకరించింది. జోనల్‌ వ్యవస్థకు మూడు రోజుల్లో గెజిట్‌ ఇవ్వడమే దీనికి నిదర్శనమని లోకేశ్ అన్నారు.