ఇల్లు, పిల్లలే ఆ నాయకుల లక్ష్యం … అదే మోడీకి వరం?

modi focus on opposition parties family problems

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దేశ రాజకీయాలు చూస్తుంటే ఇప్పట్లో బీజేపీ దూకుడుని అడ్డుకునే శక్తి కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి పోరాడాల్సిన కాంగ్రెస్ అంతకంతకు జావగారిపోతోంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ నీడలోనో దాని వ్యతిరేకత మీదనో ఆధారపడ్డవాళ్లు కూడా మౌనం దాల్చడంతో మోడీ, అమిత్ షా ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు తయారైంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్ వైఫల్యం అన్నట్టు పైకి అనిపిస్తున్నా అసలు హేతువు వేరే ఉంది. ఇల్లు దాటని నాయకులే ఇప్పుడు మోడీ పాలిట వరం అయ్యారు.

దేశంలో ముఖ్యంగా కేంద్రంలో సంకీర్ణ యుగం ప్రారంభం అయ్యాక రాజకీయం ఏ ఒక్క పార్టీ సొంత వ్యవహారం కాదని తేలింది. కాంగ్రెస్ లాంటి పార్టీని ఢీకొట్టడానికి చంద్రబాబు మొదలుకుని చాలా ప్రాంతీయ పార్టీల నాయకుల ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. తరచూ సమావేశాలు జరిగేవి. కాంగ్రెస్ కి ప్రత్యామ్న్యాయ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ క్రమాన్ని గుర్తు చేసుకుంటే జయలలిత,కరుణానిధి, చంద్రబాబు,లాలూ,ములాయం, మాయావతి ,మమతా బెనర్జీ, శరద్ పవార్, శరద్ యాదవ్, నితీష్ కుమార్, చౌతాలా, ఫరూక్ అబ్దుల్లా…ఇలా ఎంతో మంది ప్రాంతీయ పార్టీల నాయకుల జాతీయ రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషించడానికి ఉత్సాహం చూపించారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ పేరు కోసం శ్రమించేవారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సోషలిస్ట్ భావజాలం నుంచి వచ్చిన ఈ నాయకుల్లో చాలా మంది చేసిన తప్పుల నుంచి తప్పించుకోడానికో,రాజకీయ అవసరాలకో క్రమంగా అదే పార్టీ పంచన చేరడం మొదలెట్టారు. అయినప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు ప్రాతిపదికన జాతీయస్థాయిలో మిగిలిన పార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నాయి. మోడీ ప్రధాని పీఠం ఎక్కేసరికి ఈ పరిస్థితి మారిపోయింది. అందుకు కారణం ఇల్లు, పిల్లలే.

పైన మనం చెప్పుకున్న నాయకులంతా వయసులో పెద్ద వాళ్ళు అయిపోయారు. అంతకన్నా ముఖ్యంగా తమ రాజకీయ వారసత్వాన్ని కొడుకులు లేదా కూతుళ్ళకి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలి. అంటే సొంత రాష్ట్రంలో బలంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మొదలు అయ్యాయో అప్పుడే సీన్ మారిపోయింది. ఢిల్లీ రాజకీయాలు వదిలేసి కేంద్రం చెప్పుచేతల్లో ఉండటానికి రెడీ అయిపోయారు. దీంతో ఆయా ప్రాంతాలకి పరిమితమైన ఈ నాయకుల్ని దారిలోకి తెచ్చుకోవడం మోడీకి సులభం అయిపోయింది. రాజకీయ వారసత్వం ప్రత్యక్షంగా చేస్తున్న నష్టం ఒకటైతే పరోక్షంగా ప్రశ్నించే సత్తా వున్న పుల్లులాంటి వారిని కూడా పిల్లుల్లా మార్చేసి ప్రజాస్వామ్యం విలువని దిగజారుస్తోంది. ఇదే దేశంలో రాజకీయ నియంతృత్వానికి దారి తీస్తోంది. తల పండిన ఈ నాయకులంతా ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే, ఇల్లు , పిల్లలే లోకమనుకుంటే ఆ కోరిక నెరవేరదు సరికదా ప్రజాస్వామిక విలువలేని భారతానికి పునాది వేసిన పాపం మూటకట్టుకోవాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు:

డేరాలు ఉంటాయా.. ఊడతాయా..?

దినకరన్ ఎత్తుకు పళని పైఎత్తు

భూసర్వే కోసమే సిట్టింగుల మంత్రం