Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడెవరు మిత్రులుగా ఉంటారో, ఎప్పుడెవరు శత్రువులవుతారో ప్రజలకు అర్ధం కావడం లేదు. గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రి జయలలిత మరణించిన దగ్గరనుంచి ఆ రాష్ట్ర రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. జయలలిత మరణం తరువాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం, ఆయన రాజీనామా, శశికళ ఎంట్రీ, ఆమె జైలుకు వెళ్లడం, పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య సయోధ్య, శశికళ వర్గానికి చెక్ పెట్టడం వంటి పరిణామాలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరయింది. నిజానికి జయ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలోనూ, తమిళనాడులో జరిగిన అన్ని రాజకీయమార్పుల్లోనూ కేంద్రప్రభుత్వ హస్తం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. శశికళపై ఉన్న వ్యతిరేకతో లేక రాజకీయ శూన్యతను బీజేపీకి అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశమో స్పష్టంగా తెలియదు కానీ… మోడీ తన కనుసన్నల్లో తమిళ రాజకీయాలను నడిపించారు.
సాధారణంగా అధికారపార్టీలో సంక్షోభం ఏర్పడినప్పుడు… ప్రతిపక్షం దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. కానీ విచిత్రంగా తమిళనాడులో ప్రతిపక్ష హోదాలో ఉన్న డీఎంకె మాత్రం ఈ రాజకీయ శూన్యత నుంచి ఏమాత్రం లాభపడలేదు. అన్నాడీఎంకె అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడానికి గానీ, ప్రభుత్వ ఏర్పాటుకు గానీ ఏ దశలోనూ డీఎంకె ప్రయత్నాలు చేయలేదు. పన్నీర్ సెల్వానికి, పళనిస్వామికి పాలనలో స్టాలిన్ పూర్తి సహకారం అందించారు కూడా. అన్నాడీఎంకెలో జరుగుతున్న పరిణామాల వెనక కేంద్రప్రభుత్వ హస్తం ఉందన్న ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత స్టాలిన్ వెనక్కుతగ్గి ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇలా ఒకేసారి అధికార, ప్రతిపక్షాలు రెండింటినీ తన నియంత్రణలో ఉంచుకున్న మోడీ… అదే సమయంలో తమిళనాడులో పాగా వేసేందుకు మరో ప్రయత్నం కూడా చేశారు.
కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయంపై ఎటూ తేల్చుకోకుండా మీమాంసలో ఉన్న రజనీకాంత్ ను… ఎలాగైనా యాక్టివ్ పాలిటిక్స్ లోకి తెచ్చేందుకు మోడీ, షాలు చేయని ప్రయత్నం లేదు. బీజేపీలోకి రజనీకాంత్ ను చేర్చుకోవడానికైనా… లేదంటే రజనీ కొత్త పార్టీ పెడితే… దానికి మద్దతుగా, మిత్రపక్షంగా ఉండడానికైనా… కమలం పార్టీ సిద్ధపడింది. కానీ. రాజకీయాల్లో గెలిపించే శక్తి ఏమిటో తాను తెలుసుకోలేకపోతున్నానంటూ… రజనీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఇంకా ఆలోచించే స్టేజ్ లోనే ఉన్నారు. రజనీ అయోమయానికి తోడు… అంతర్గత కుమ్ములాటలు, అమ్మ లేని కారణంతో అన్నాడీఎంకెకు తమిళనాట రోజురోజుకీ ఆదరణ తగ్గిపోతోంది. దీంతో మోడీ, షా కొత్త ఎత్తువేశారు. అధికారపక్షాన్ని, రజనీని వదిలేసి… ప్రతిపక్షాన్ని దువ్వడం మొదలుపెట్టారు. తన చెన్నై పర్యటనలో ప్రధాని మోడీ డీఎంకె అధినేత కరుణానిధిని కలవడం ఇందులో భాగమే.
పదమూడేళ్ల క్రితం అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్టీఏతో డీఎంకె తెగతెంపులు చేసుకున్న తరువాత బీజేపీ నేత ఒకరు కరుణానిధిని కలవడం ఇదే ప్రధమం. మోడీ, కరుణానిధి భేటీతో బీజేపీ, డీఎంకెల పాత స్నేహం తిరిగి తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కలిసి రేపు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని డీఎంకె ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. వరద ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు రద్దుచేస్తున్నట్టు డీఎంకె వర్గాలు తెలిపాయి. వరదల కారణంగానే కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని డీఎంకె చెబుతున్నప్పటికీ… బీజేపీతో మైత్రీ బంధమే ఈ నిర్ణయానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ, డీఎంకె కొత్త పొత్తు… తమిళనాడు రాజకీయాల్లో ఎన్ని మార్పులు తెస్తుందో చూడాలి.