Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఈ ప్రశ్నకు ఏ సగటు రాజకీయ పార్టీని , ఆ పార్టీ నాయకులని ప్రశ్నించినా ఒక్కటే సమాధానం చెబుతారు. తమ పార్టీ , తాము సమర్ధించే కూటమి గెలవాలని కోరుకుంటారు. కానీ వైసీపీ మాత్రం అలా కోరుకోవడం లేదు. ఈసారి ఎన్నికల్లో కూడా మోడీ గెలవాలని ఆయన నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుంటే పర్లేదు. కానీ మిగిలిన పార్టీలు ఏమి అనుకుంటాయో అన్న కనీస ఆలోచన కూడా పక్కనబెట్టి జగన్ కి కుడి భుజంలా వ్యవహరించే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి బయటపడిపోయారు.
బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు అఖిలపక్షభేటీ లో వైసీపీ పోకడ సాటి పార్టీలకు షాక్ ఇచ్చింది. సహజంగా ఇలాంటి భేటీల్లో ఎవరూ రాజకీయ ప్రస్తావన తేరు. కానీ వైసీపీ తరపున ఈ సమావేశంలో పాల్గొన్న విజయసాయి మాత్రం కావాలనే రాజకీయ ప్రస్తావన తేవడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో మోడీ గెలవాలని కోరారు. Nda లోని పార్టీలు కూడా ఇలా మాట్లాడని తరుణంలో విజయసాయి కామెంట్స్ చూసి సిపిఐ నేత రాజా తో పాటు మిగిలిన పార్టీల ప్రతినిధులు ఆశ్చర్య పోయారు. కేసుల ఊబి నుంచి బయటపడేందుకు కొన్నాళ్లుగా బీజేపీ భజన చేస్తున్న వైసీపీ మరీ ఈ స్థాయిలో అఖిలపక్షభేటీలో ఇలా వ్యవహరించడం చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తో పొత్తుకు వైసీపీ ఎంతగా తహతహలాడుతోందో అర్ధం అవుతుంది.
మోడీ భజన విషయంలో చెలరేగిపోతున్న వైసీపీ నేతలు ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఏ మోడీ గురించి తాము పొగుడుతున్నారో అదే మోడీ గురించి రేపు ఓట్లు వేయాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి అనుకుంటున్నారన్న కనీస అంశాన్ని మర్చిపోతున్నారు. పొత్తులు పార్టీలు పెట్టుకున్నా ఓట్లు వేయాల్సింది మాత్రం ప్రజలు. ఈ విషయంలో నేల విడిచి సాము చేసిన పార్టీలన్నీ నేల మీదకు దిగేలా ప్రజలు ఎన్నో సార్లు తీర్పు ఇచ్చారు. ప్రధాని మోడీకి సొంత రాష్ట్రంలో కూడా ఇలాంటి అనుభవమే ఇటీవల ఎన్నికల్లో ఎదురైన విషయం మర్చిపోతే ఎలా ?