Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో పార్టీ మారడం సహజం అయిపోయిన రోజులు ఇవి. గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇద్దరు నాయకులు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇంకొకరు విపక్షం తరపున ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి, ఆ ఇద్దరు బంధువులు కూడా. వాళ్ళే మోదుగుల వేణుగోపాల రెడ్డి , అయోధ్య రామిరెడ్డి. బావబావమరిది అయ్యే వీరిద్దరి మధ్య బంధుత్వ బంధం చూసే నాడు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోదుగుల ఎంత అడిగినా నరసారావు పేట ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వలేదు. టీడీపీ టికెట్ ఇచ్చినా బావ అయోధ్య రామిరెడ్డి విజయం కోసం త్యాగాలు చేస్తాడేమోనన్న భయం చంద్రబాబుది. అందుకే గుంటూరు లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మోదుగులని నరసరావుపేట నుంచి తప్పించారు. దీంతో బాబు అనుకున్నట్టే ఇటు ఎమ్మెల్యే, అటు ఎంపీ రెండూ టీడీపీ కే దక్కాయి.
కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ బావాబావమరుదులిద్దరూ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట. అధికార పార్టీలో తనకి సరైన గుర్తింపు, గౌరవమర్యాదలు దక్కడం లేదన్న బాధతో ఉన్న మోదుగుల ఇప్పటికే వైసీపీ తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. టీడీపీ నాయకులు కూడా ఇదే సందేహంతో వున్నారు. దీంతో బావాబావమరుదులిద్దరూ ఒకే పార్టీ లో వుండే అవకాశం ఉంటుందని ఆ కుటుంబానికి దగ్గరైన వాళ్ళు భావించారు. కానీ వారి కల ఫలించే అవకాశం లేదని తెలుస్తోంది. మోదుగుల ఫీల్ అవుతున్నట్టే అయోధ్య కూడా వైసీపీ లో ఇబ్బంది పడుతున్నారట. అందుకే ఆయన కూడా టీడీపీ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. బంధుత్వం మాటెలా వున్నా ఆ ఇద్దరికీ ఒకే పార్టీలో వుండే యోగం లేనట్టుంది.
మరిన్ని వార్తలు: