దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న వేళ పంజాబ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమను ఎదురించి ప్రియుడి ఇంటికి చేరుకున్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. వివరాలు.. హోషియాపూర్‌కు చెందిన బల్వీందర్ కౌర్ కుమార్తె(19) అమన్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇంట్లో గొడవపడి భల్జాన్ గ్రామంలో ఉన్న అమన్ వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి బల్వీందర్ తమ కుమార్తె కనిపించడం లేదని.. ఇందుకు అమనే కారణమంటూ పోలీసులకు ఏప్రిల్ 22న ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో తన బంధువులు సదేవ్, ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు గుర్దీప్ సింగ్ సహా మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో పంచాయతీ పెట్టించి కూతురిని తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 25 అర్ధరాత్రి కూతురి చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించి.. తన కజిన్ శివరాజ్, లాలాను పిలిపించింది. వారిద్దరు నిద్రలో ఉన్న బాధితురాలిని గొంతునులిమి చంపేశారు. అనంతరం సత్యదేవ్, గుర్దీప్‌లతో కలిసి బల్వీందర్ కూతురి శవాన్ని రహస్యంగా కాల్చేసి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బల్వీందర్, శివరాజ్‌లను విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారితో పాటు లల్లా, గుర్దీప్, సదేవ్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.