టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమి లక్ష్యంగా ఏ నాయకుడితో అయినా కలుస్తానని ప్రతిన పూనిన ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి ఇంకో సంచలనానికి తెర లేపారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు.ఇంతకుముందు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి స్వయంగా మోత్కుపల్లి ఇంటికి వెళ్లగా ఈరోజు మాత్రం నర్సింహులు జనసేన కార్యాలయానికి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని ఓడించమని కోరడానికి తిరుమల శ్రీవారి వద్దకు కాలినడకన వెళ్లిన మోత్కుపల్లి తాజా భేటీ రాజకీయ వర్గాల్లో సంచలనమే.
తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాల్సిన మోత్కుపల్లి ఆ విషయం పక్కనబెట్టి చంద్రబాబుని టార్గెట్ చేయడం చూస్తుంటే ఆపరేషన్ గరుడ గుర్తుకు వస్తోంది. చంద్రబాబు ఇచ్చిన గవర్నర్ పదవి హామీని తాము నెరవేరుస్తామని బీజేపీ చెప్పడంతో మోత్కుపల్లి ఈ తరహాలో వ్యవహరిస్తున్నట్టు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆపరేషన్ గరుడలో ఎవరి గురించి పరోక్ష ప్రస్తావన వుందో, వారినే మోత్కుపల్లి కలవడం కూడా ఆ అనుమానాలు బలపడడానికి కూడా కారణం అవుతోంది.
ఈ భేటీ తర్వాత పవన్ , మోత్కుపల్లి ప్రెస్ తో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు వారి మాటలు విన్నాక గానీ భేటీ అసలు ఉద్దేశం బయటకు వస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం మోత్కుపల్లి ఏమి చేసినా ,ఎవరిని కలిసినా ఆయన గురించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.