తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ-కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లిద్దరూ ఒకే వేదికపైకొచ్చి ఒకే చోట కూర్చుంటున్నారని, అసలు, వాళ్లిద్దరూ కవల పిల్లలా? చిన్నప్పుడు కుంభమేళాలో తప్పిపోయి మొన్ననే కలిశారా అన్నంత ప్రేమగా ఉంటున్నారని, ఒకరినొకరు బాగా పొగుడుకుంటున్నారని వెటకారంగా మాట్లాడారు.
అసలు వాళ్లిద్దరూ కలవడమే విచిత్రమైన దృశ్యమంటే, వాళ్లిద్దరూ కలిసిన తర్వాత మాట్లాడిన మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. జీవన్‌రెడ్డిది కుటుంబ పాలన అని ఒకనాడు ఎల్. రమణ అన్నారని, జీవన్‌రెడ్డి అనుచరులంతా గూండాలు, రౌడీలని చెప్పిన రమణకు ఇప్పుడు వాళ్లు ముద్దొస్తున్నరా? ఎల్. రమణ ప్రజలకు పనికిరాని నాయకుడని జీవన్‌రెడ్డే అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న జీవన్‌రెడ్డి, ఎల్. రమణ ఇప్పుడెలా ఒక్కటయ్యారు? అని కవిత ప్రశ్నించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, జీవన్ రెడ్డి.. ఈ ఇద్దరూ జగిత్యాల బిడ్డలే గనుక అయితే తన ప్రశ్నలకు సమాధానమివ్వాలని సవాల్ విసిరారు. జగిత్యాలలో కాంగ్రెస్ జైత్రయాత్ర అని జీవన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ జరగబోయేది టీఆర్ఎస్ జైత్రయాత్ర అని ధీమా వ్యక్తం చేశారు.