ఆయన టీడీపీ ఎంపీ. సీనియర్ నాయకుడు. వరుస విజయాలతో హోరెత్తుతున్న బీసీ వర్గానికి చెందిన నేత. నిజానికి వినయానికి ఏదైనా పేరుంటే అది ఆయనదే అన్నంత వినయంగా ఉంటారు. చంద్రబాబుకు అత్యంత విధేయుడు కూడా. చాలా సౌమ్యంగా, తన పనేదో తాను చేసుకుని పోయే నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఎవరో కాదు బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు. 2009లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలులు బలంగా వీచినా మచిలీపట్నంలో మాత్రం ఆయన ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ వరుసగా అక్కడ నుంచే రెండోసారి గెలిచారు. అయితే, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపధ్యంలో వారసులను రంగంలోకి దింపాలని ఉవ్విళ్లూరుతున్న నాయకుల సంఖ్యకూడా పెరుగుతోంది.
ఇదే క్రమంలో ఈ ఎంపీ కూడా తన కుమారుడికి టికెట్ ఇస్తారా? లేదా? భీష్మిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుండి తన కుమారునికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారు. మిగిలిన ఎంతో మంది సీనియర్ల వారసులకు చంద్రబాబు టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుండడంతో ఈయన కూడా తన వారసుడిని రంగంలోకి దిం పాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, పెడనలో ఈయనకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేక గాలులు వీస్తుండడం గమనార్హం.ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా పెడన టికెట్‌ను ఒకే వ్యక్తికి కేటాయిస్తూ వచ్చారు. ఆయనే కాగిత వెంకట్రావ్. ఒకే సామాజిక వర్గానికి చెందిన వెంకట్రావుకు టీడీపీ అధిష్టానంలో మంచి పేరుంది. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఈయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1985 ఎన్నికల నుంచి ఆయనే పెడన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.
గెలిచినా.. గెలవకపోయినా కూడా టీడీపీ ఈ టికెట్‌ను ఆయనకే కేటాయిస్తోంది. 1985, 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించిన కాగిత.. అసెంబ్లీ చీఫ్ విప్ పదవిని కూడా పొందారు. అయితే, 1989, 2004 లో మాత్రం ఓడిపోయారు. ఇక, 2009లో నియోజకవర్గాలు పునర్విభజన జరిగిన నేపథ్యంలో పెడన నుంచి ఆయన బరిలోకి దిగి ఒకింత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశలు గల్లంతయ్యి వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు.అయినా కూడా ఆయన పార్టీని మారకుండా అధినేత ఆదేశాల మేరకు పార్టీని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగారు. పార్టీ కేడర్‌లోనూ ఆయనపై మంచి అభిప్రాయం ఉండడం గమనార్హం. దీంతో 2014 ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరుపై నడకే అయింది. ఇంత సీనియర్ మోస్ట్ అయిన కాగిత మంత్రి వర్గంలో బెర్త్‌ను ఆశించారు. కానీ, చంద్రబాబు సమీకరణల నేపథ్యంలో కాగితకు అవకాశం ఇవ్వలేకపోయారు.
అయినా కూడా కాగిత ఎక్కడా ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని పార్టీని కానీ, అధినేతను కానీ విమర్శించలేదు. పైగా మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. అటువంటి నేపధ్యం ఉన్న కాగితను కాదని టికెట్ ఇస్తారా ? మరి. అయితే నిన్న కాక మొన్నలైన్ లోకి వచ్చిన ‘నారాయణరావు’కే ఈ అభిప్రాయం ఉంటే ముప్పయి సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్న ‘కాగిత’కు ఎంత ఉండాలి అని ఆయన అనుచరులు ఎదురుదాడి చేస్తున్నారు.జిలా మంత్రి ‘దేవినేని ఉమామహేశ్వరరావు’ ఈ విషయంలో కలగచేసుకోవడం లేదు. ఎవరైనా కదిలిస్తే..దాటవేస్తున్నారు. 2009, 2014లో ఎంపిగా గెలిచిన ‘నారాయణరావే’ మళ్లీ ఎంపిగా పోటీ చేస్తారని, ఆయన కుమారునికి సీటు ఇవ్వరని తెలుస్తోంది. ఒక వేళ ‘నారాయణరావు’ ఎంపిగా పోటీ చేయకుండా తన కుమారునికి ‘పెడన’ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వమని పట్టుపడితే’కాగిత’ను మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుందని మంత్రి ఉమా కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా నారాయణరావు పోటీ చేస్తారా..? ఆయన కుమారుడు పోటీ చేస్తారా..? అనేది వారే చంద్రబాబు వద్ద తేలనుంది.