ఇటీవల కాపు రిజెర్వేషన్ల అంశం మీద ఏపీ ప్రతిపక్షనేత జగన్ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పటిలో చల్లారేలా లేదు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇటీవల జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో జగన్ కాపు రిజర్వేషన్లపై మాట్లాడిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని యాభై శాతం దాటడంతో రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో లేదనీ ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని అందుకే ముందే మాటిచ్చి ఆ మాట తప్పలేనని జగన్చెప్పుకొచ్చారు. అయితే నోరు జారిన విషయాన్నీ రెండ్రోజులకి పసిగట్టిన జగన్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా తన వ్యాఖ్యలని వక్రీకరించారని తాను ఎపుడవు కాపుల రిజెర్వేషన్ కు మద్దతు ఉంటానని అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన కాపు సమితి పదకొండవ వార్షికోత్సవానికి ముద్రగడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పి అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని, ఇది సబబు కాదని అన్నారు. ‘మేము 20 వేల కోట్లు ఇస్తాం. ఇతర కులస్థుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా..’ అని ఆయన జగన్‌ను సూటిగా ప్రశ్నించారు ముద్రగడ. ఇక వచ్చే ఎన్నికల్లో కాపుల డిమాండ్లను పరిష్కరించే వారికే తాము పట్టం కడతామని వారి పల్లకీ నే మోస్తామని స్పష్టం చేశారు.