కరోనా కాలం.. లాక్ డౌన్ సమయంలో కూడా హత్యలు వంటి దారుణ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వ్యక్తి షార్జాలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల రవీంద్ర రోడ్డుకు చెందిన దేశవేని నర్సయ్య, రాధ దంపతుల రెండో కుమారుడు నవీన్ ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరానికి వెళ్లాడు.
అక్కడ షార్జాలోని ఓ కంపెనీలో కారు వాషింగ్ చేసేపనిలో కుదురుకున్నాడు. అలా పని చేసుకుంటున్నాడు.అయితే ఈ నెల 23వ తేదీ రాత్రి తన గదిలో నవీన్ భోజనం చేస్తుండగా.. కేరళకు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. దీంతో ఆ వ్యక్తి కత్తితో నవీన్‌ను పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దుబాయిలోని భారత అధికారులు కోరుట్లలోని కుటుంబసభ్యలకు ఆదివారం రాత్రి తెలిపారు. దీంతో నవీన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తును చేపడుతున్న సమాచారం.