సీఎం పీఠం మీద నెల రోజులు కుర్చున్నందుకు దాదాపు 30 ఏళ్లకు పైగా వెన్నుపోటు దారుడు అన్న ముద్ర మోస్తున్న నాయకుడు నాదెండ్ల భాస్కరరావు. ఎన్టీఆర్ ని గద్దె దించినందుకు ఆయన ఇప్పటికీ ఆ భారం దించుకోలేకపోతున్నారు. సొంత సామాజిక వర్గమే ఆయన్ను శత్రువులా చూస్తున్నప్పటికీ రాజకీయంగా ఆయన ప్రయాణం కొనసాగించారు. కొడుకు నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ లో కుదురుకోవడంతో కాస్త సైలెంట్ అయిన భాస్కరరావు అప్పుడప్పుడు రాష్ట్ర రాజకీయాలపై తన వాణి,బాణీ వినిపిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ కి వ్యతిరేకంగా నాదెండ్ల కుమారుడు బాలయ్యకి లీగల్ నోటీసు పంపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పరిస్థితుల్లో నాదెండ్ల రాష్ట్ర రాజకీయాలు గురించి మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ గురించి కీలక కామెంట్ చేశారు.
జగన్ కి ప్రజాకర్షణ మెండుగా ఉందని నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయపడ్డారు. పైగా రాజకీయంగా చేస్తున్న పోరాటంతో ఆయనకు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని , కానీ జగన్ అనుసరిస్తున్న విధానాలు , పద్ధతుల్లో మార్పులు రావాలని నాదెండ్ల అంటున్నారు. ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహాలు రచించడంలో జగన్ అండ్ కో ఫెయిల్ అవుతున్నట్టు 2014 ఎన్నికల్లో ఓటమి నిరూపించింది. ఇక జగన్ లో దుందుడుకు వైఖరి నంద్యాల , కాకినాడ ఉపఎన్నికల్లో షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా జగన్ ఈ బలహీనతల్ని అధిగమించలేదు అనడానికి ఆంధ్రులు బద్ధ శత్రువులా చూస్తున్న బీజేపీ తో రాజకీయంగా అంట కాగడమే పెద్ద ఉదాహరణ. ఇక చంద్రబాబుని తిట్టేందుకు వాడుతున్న భాషలో కూడా మార్పు లేదు. నాదెండ్ల లాంటి పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి కలలు కంటున్న సీఎం పీఠం కోసం అయినా జగన్ లో మార్పు రావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.