మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వార్త రాజకీయవర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేత ఇప్పుడే పురుడుపోసుకున్న జనసేనలో ఎందుకు చేరినట్లు అని తెగ చర్చించుకుంటున్నారు. రాజకీయమే ఇరువురిని దగ్గర చేసిందని కొందరు భావిస్తుండగా, దీన్ని మించిన మరో కారణం ఉందని తెలుస్తోంది. మనోహర్, పవన్ కల్యాణ్ ఒకటిగా మారడానికి కారణం స్కూల్ స్నేహమట నాదెండ్ల మనోహర్, తాను ఒకే స్కూలులో చదువుకున్నామని పవన్ కల్యాణ్ స్వయంగా పేర్కొన్నారు. అమరావతిలో ఈ రోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం నాదెండ్ల మనోహర్, ఇతర నేతలతో కలిసి పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ రాకతో జనసేన మరింత బలోపేతం అయిందని తెలిపారు. పార్టీ పెట్టినప్పటి మనోహర్ నుంచి తనకు గైడ్ చేశారని.. ఆయన విలుమైన సూచనలు, సలహాలు తీసుకొని అమలు చేశామని పవన్ తెలిపారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయాన్ని తామిద్దరం కోరుకుంటున్నామనీ, అదే తామిద్దరినీ కలిపిందని వ్యాఖ్యానించారు. హోదా, ప్యాకేజీపై నాయకులు నాలుగు రకాల సందర్భాల్లో నాలుగు రకాల మాటలు మాట్లాడితే రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందని హెచ్చరించారు.