Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జునతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో జనాలకు వర్మ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేస్తున్నట్టు వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఇకపై తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తానని వర్మ అందరి మధ్య చెప్పాడు. నిజానికి వర్మ చెప్పింది చేస్తే అంతకుమించి గుడ్ న్యూస్ ఏముంటుంది ?. కానీ వర్మని నమ్మడానికి వీల్లేదని చెప్పేందుకు బోలెడు ఉదాహరణలు. ఇప్పుడు నాగార్జున సినిమా ఓపెనింగ్ రోజు చెప్పినట్టే ఆ మధ్య వంగవీటి ట్రైలర్ విడుదల ఫంక్షన్ లోను వర్మ ఇలాగే చెప్పాడు. ఆ రోజు సభాముఖంగా అడిగిన రాజమౌళికి ఇకపై సినిమాల విషయంలో సీరియస్ గా ఉంటానని చెప్పాడు. కానీ జరిగింది వేరు. ఆ విషయం ప్రత్యేకంగా వేరెవరో చెప్పక్కర్లేదు. వంగవీటి సినిమా చూసిన సగటు ప్రేక్షకుడికి అది తెలిసిపోయింది. ఎంతో డ్రామా కి అవకాశమున్న ఆ సబ్జెక్టు ని కేవలం కొన్ని క్రైమ్ సంఘటనల సమాహారంగా తీర్చిదిద్దిన వర్మ పనితనం మీద అప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వర్మ నిజానికి చాలా అదృష్టవంతుడు.
వర్మ తీసినన్ని ప్లాప్స్ ఇంకో దర్శకుడు తీసి ఉంటే అతనికి ఒక్క సినిమా ఛాన్స్ కూడా వచ్చేది కాదు. వెంట ఒక్కరు వుండే వాళ్ళు కాదు. కానీ వర్మకి సినిమా వెంట సినిమా వస్తోంది. టాలీవుడ్ లో టాప్ దర్శకులంతా అతనిన్నింకా ఆరాధిస్తున్నారు. వర్మ మనసు పెడితే ఏదో అద్భుతం చేయగలడని నమ్ముతున్నారు. వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ అయితే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల లాంటివాళ్లు కూడా సినిమాల కోసం వెదుక్కోవాల్సి వస్తోంది. కానీ వర్మ కి ఆ గతి పట్టలేదు. ఎప్పుడో 28 ఏళ్ల కిందట చేసిన శివ ఇంకా అతనికి అవకాశాలు తెచ్చిపెడుతోంది. నాగార్జున హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా రాము టాలెంట్ మీద నమ్మకంతో కొత్త సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ఓపెనింగ్ లో చెప్పినట్టు, రాజమౌళి కి ఒకప్పుడు ఇచ్చిన హామీ నెరవేరేట్టు వర్మ పనితనం వుండాలని ఆశిద్దాం. చెప్పిన మాటకు వర్మ కట్టుబడి వుండాలని ఆ దేవుడిని కోరుకుందాం.