Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్’. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్దం అయ్యింది. ఆఫీసర్ చిత్రం తర్వాత తాను అఖిల్‌తో సినిమాను చేయబోతున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. అక్కినేని ఫ్యాన్స్ వర్మతో అఖిల్ మూవీ అనడంతో కాస్త టెన్షన్ పడుతున్నారు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అఖిల్‌తో సినిమా చేసేంత సత్తా ప్రస్తుతం లేదని, అఖిల్ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి, ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ ఆ అంచనాలను అందుకోలేడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరేం అన్నా, ఎవరేం అనుకున్నా కూడా తాను అఖిల్‌తో సినిమాను తీసి తీరుతాను అంటూ ఇటీవలే ప్రకటించాడు. అయితే ఆ వార్తలపై నాగార్జున స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తాజాగా ‘ఆఫీసర్’ చిత్రం ప్రమోషన్లో భాగంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ… వర్మ దర్శకత్వంలో అఖిల్ మూవీపై ఇంకా ఏమీ అనుకోలేదని, తాను ఆ సినిమా గురించి ట్వీట్ చేయలేదు. తాను చేయని ట్వీట్ గురించి తనను అడిగితే ఎలా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించాడు. దాంతో వర్మ దర్శకత్వంలో అఖిల్ సినిమాను చేయడం నాగార్జునకు ఇష్టం లేదని తేలిపోయింది. నాగార్జున ‘ఆఫీసర్’ సక్సెస్ అయితే అఖిల్‌ను వర్మ చేతిలో పెట్టే అవకాశాలున్నాయి. ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. కనుక వర్మ, అఖిల్‌ల మూవీ ఉండదని సినీ వర్గాల వారు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. వర్మ దర్శకత్వంలో సినిమా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అఖిల్ ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాను ఇదే సంవత్సరంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.