చెన్నూరు టికెట్ కోసం టీఆర్‌ఎస్‌లో చెలరేగిన చిచ్చులో ఓ సామాన్య కార్యకర్త అసువులు బాశాడు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపు విషయంలో నల్లాల ఓదేలు, ఎంపీ బాల్క సుమన్ మధ్య వర్గ పోరు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఇందారంలో సెప్టెంబర్ 12న బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి సిద్ధమవగా.. ఆయనకు వ్యతిరేకంగా ఓదేలు అనుచరులు ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో రేగుంట గట్టయ్య అనే కార్యకర్త తన మీదా తన చుట్టుపక్కల వారి మీదా పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.
60 శాతానికి పైగా కాలిన గాయాలతో మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్య నిన్న మధ్యాహ్నం మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే గట్టయ్య మృతి చెందడంతో ఇందారంలో విషాదం నెలకొంది. గట్టయ్య మరణ వార్త తెలిసి ఇందారం వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గట్టయ్య మృతితో ఆయన కుటుంబ రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయి విజ్ఞేశ్(3) ఉన్నారు. బుధవారం ఇందారంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన అనుచరుడి మృతి మీద స్పందించిన ఒదేలు గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని ఆయన కుమార్తె సాయినివేదిత, కుమారుడు సాయివిజ్ఞేశ్‌పై రూ.5 లక్షల చొప్పున ఇద్దరిపై రూ.10లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డిపాజిట్ చేస్తానని చెప్పారు. అంత్యక్రియల ఖర్చు మొత్తం బరించుకుంటామని కుటుం బానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.