Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై పదకొండేళ్ల క్రితం జరిగిన మానవబాంబు దాడి కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పది మందిపై దాఖలైన అభియోగాలను కొట్టివేస్తూ తుదితీర్పు వెల్లడించింది. కేసుకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించటంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని న్యాయస్థానం పేర్కొంది. అక్టోబరు 16, 2006న బంగ్లాదేశ్ కు చెందిన డాలి శరీరానికి బాంబు అమర్చుకుని బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతికి ఒడిగట్టాడు. రాత్రి 7.30 ప్రాంతంలో జరిగిన ఘటనలో హోంగార్డు సత్యన్నారాయణ అక్కడికక్కడే చనిపోయారు.
వెంకటరావు అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడితో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా షాక్ కు గురయింది. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనక హుజీ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని గుర్తించారు. నిందితులైన పదిమందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. అనంతరం కేసు విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక పరిశోధన బృందం సిట్ ముసారం బాగ్ లోని గులాం యాజ్దానీని, హజీ ఉగ్రవాది షాహెద్ బిలాల్ ను ప్రధాన నిందితులుగా గుర్తించి వారిపై అభియోగ పత్రాలు దాఖలు చేసింది. అయితే బిలాల్ , అతని తమ్ముడు అనంతర కాలంలో పాకిస్థాన్ వెళ్లిపోయారు.
అనంతరం వారు ఐఎస్ ఐ ఏజెంట్ల చేతిలో హత్యకు గురయినట్టు వార్తలొచ్చాయి. అధికారకంగా ధృవీకరణ లేకపోవటంతో పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. మరొక నిందితుడు గులాం యాజ్దానీ ఢిల్లీ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. మిగిలిన పదిమంది నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ , చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.11 ఏళ్ల నుంచి వారిపై విచారణ జరుగుతోంది. తుది తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పోలీసులకు, ఉగ్ర దాడి బాధితులకు ఆశనిపాతంగా మారింది. పదిమంది నిందితుల్లో తొమ్మిది మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారు విక్టరీ సింబల్స్ చూపుతూ కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చారు.
మరిన్ని వార్తలు: