Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేనానిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలతో తనపై దుమ్మెత్తి పోస్తే, తాను దులుపుకుని పోవాలా అని మండిపడ్డారు. పవన్ చేసిన నిరాధార ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకే పవన్ రేటింగ్ ఇస్తారా..? అని లోకేశ్ ధ్వజమెత్తారు. శేఖర్ రెడ్డితో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన పవన్… ఆ తర్వాత మాట మార్చారని, ఆయన వద్ద నిజంగా ఆధారాలుంటే… ఒక్కరోజులోనే ఎలా మాటమారుస్తారని ప్రశ్నించారు. ప్లానింగ్ బోర్డ్ సభ్యుడు పెద్దిరామారావు ఫొటోను శేఖర్ రెడ్డి ఫొటోగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు చెడ్డపేరు తీసుకొస్తున్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే నేరుగా తనకే ఫోన్ చేసి అడగొచ్చు కదా…
8 ఏళ్లగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని, అంతకు మించి ఎక్కువ ఆస్తులుంటే వారే తీసుకోవచ్చని లోకేశ్ సవాల్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లగా అమరావతిలో ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతోంటే విమర్శలు చేస్తారా… అని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండేవారికి ఆయన పడుతున్న కష్టం ఎలా తెలుస్తుందని నిలదీశారు. రాజధాని లేని రాష్ట్రానికి ఒక రూపు తీసుకొస్తున్నది ఎవరని, 8 శాతం వృద్ధిరేటును 12 శాతానికి తీసుకొచ్చింది ఎవరని లోకేశ్ ప్రశ్నించారు. పోలవరం టెండర్లలో అవినీతి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. చంద్రబాబు పడే కష్టాన్ని విమర్శిస్తోంటే టీడీపీ కార్యకర్తగా ఎంతో బాధపడ్డానన్నారు. నాలుగేళ్లలో అమరావతిలో జరిగిన అభివృద్ధి హైదరాబాద్ లో కూర్చున్న వారికి ఏం తెలుస్తుందని లోకేశ్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు తమతో కలిసి ఉన్న పవన్ కు ఒక్కసారిగా రాష్ట్రమంతా అవినీతిలో మునిగిపోయినట్టు కనిపించిందా అని ప్రశ్నించారు. పవన్ ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తావా అని మీడియా అడగ్గా… ఆ అంశాన్ని పార్టీ చూసుకుంటుందని లోకేశ్ బదులిచ్చారు.