Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో యువతరానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే ప్రకటించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న టీడీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. 2024 కి కూడా అదే ప్లాన్ తో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 1983 లో పార్టీ ఆవిర్భావ సమయంలో ఎంతోమంది యువకులు టీడీపీ లో చేరి పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. అప్పట్లో 30 ఏళ్ల వయసు ఉన్నవారంతా ఇప్పుడు 60 దాటేసారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీనియర్స్ స్థానంలో వారి కొడుకుల్ని బరిలోకి దింపడానికి చంద్రబాబు రెడీ అయ్యారు. అదే విషయాన్ని వారికి చెప్పేసారు కూడా. అయితే పార్టీ అంటే ఒక్క ఎమ్మెల్యేలే కాదని కింది స్థాయిలో కూడా యువరక్తం ప్రవహించాలని బాబు భావిస్తున్నారు. అందుకే పార్టీలో కుర్రకారుకి ప్రాధాన్యం ఇవ్వాలి అనుకోవడమే కాదు అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేశారు. మెరికలు లాంటి యువకుల్ని ఎంపిక చేసి వారికి నాయకత్వ శిక్షణ ఇస్తున్నారు.
తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ లో చురుగ్గా వున్న యువకులకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. గుంటూరు శివార్లలోని హ్యాపీ రిసార్ట్ ఈ శిక్షణ ప్రోగ్రాం కి వేదిక అయ్యింది. భావి నాయకుల్ని సమర్ధంగా తీర్చి దిద్దే పనిని ఇప్పటికే లోకేష్ కి అండదండగా ఉంటున్న పెద్ది రామారావు అనే ఆయనకి అప్పగించారు. థియేటర్ ఆర్ట్స్ లో నిపుణుడు అయిన పెద్ది రామారావు అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు గానీ రాజీవ్ కనకాల కి బావ అంటే ఎక్కువమందికి తెలుస్తుంది. ఈయన 2009 లో ఎన్టీఆర్ ప్రచార ప్రసంగాలు తయారు చేశారు. ఆ తర్వాత కాలంలో లోకేష్ కి దగ్గరై ఆయనకి అన్ని విషయాల్లో చేదోడువాదోడు గా ఉంటున్నారట.
ఆ పెద్ది రామారావు పర్యవేక్షణలో సాగుతున్న శిక్షణలో తెలుగు విద్యార్థి నేతలు రాజకీయాలు, సామాజిక పరిస్థితులు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ప్రసంగాలు… ఇలా అన్ని కోణాల్లో రెడీ అవుతున్నారు. సమావేశం జరుగుతున్న హ్యాపీ రిసార్ట్ లోనే వీరికి భోజనాదులు ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తి చేసుకుని వెళుతున్న యువకులకు ఇస్తున్న కిట్ లో శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం ఉండటం కొసమెరుపు. ఎర్ర జెండాలకి కాలం చెల్లిందని చెప్పిన బాబు ఇప్పుడు కాషాయ దళం వేషాలు చూసి శ్రీశ్రీ ద్వారా వామపక్షాలకు ఏమైనా సంకేతాలు పంపుతున్నారో ఏమో ?