Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవ్యాంధ్ర రాజధానికి లైన్ క్లియరయింది. అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాజధాని రూపకల్పనలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను గ్రీన్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ తుదితీర్పులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు శుభవార్త అందించింది. పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తూ రాజధాని నిర్మాణాలు సాగాలని ప్రభుత్వానికి సూచించింది.
కొండవీటి వాగు దిశ మార్చినా… ప్రవాహానికి ముంపు లేకుండా చర్యలు తీసుకోవాలని, కృష్ణానది ప్రవాహానాకి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. అమరావతి నిర్మాణాలను పర్యవేక్షించేందుకు రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు నవ్యాంధ్ర రాజధానిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి తెలియజేస్తుంటాయి. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు.
రాజధాని నిర్మాణంలో ఇది శుభపరిణామం అన్నారు. ఇక నుంచి రాజధాని పనుల్లో వేగం పెరుగుతుందని చెప్పారు. తొలి నుంచి తాము నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అమరావతిలో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో భేటీలో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును చంద్రబాబు ప్రస్తావించారు. ఈశ్వరన్ బృందం వెలగపూడిలో సచివాలయం, శాసనసభలను పరిశీలించింది. సీఎం దగ్గరుండి వారికి కార్యాలయాలను చూపించారు.