Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన జాతీయ రహదారులు దిగ్బంధనం కార్యక్రమంలో అధికార టీడీపీతో సహా అన్ని ప్రధాన పార్టీలు పాల్గొన్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏపీలోని అనేక ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు జాతీయ రహదారులు దిగ్బంధనం చేసి నిరసనలు వ్యక్తంచేశారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. విశాఖలో అఖిల పక్షనాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్దిలపాలెం జంక్షన్ లో వామపక్షపార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్రం ఇప్పటికైనా దిగి వచ్చి విభజన హామీలు నెరవేర్చకపోతే ఇది ప్రజాఉద్యమంగా మారుతుందని నేతలు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు.
వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిరసనలు తెలిపారు. అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి వాహనాలను అడ్డుకోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నందిగామలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారుల దిగ్బంధనంలో పాల్గొన్నారు. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై రామవరప్పాడు కూడలి వద్ద టీడీపీ యువనేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, ప్రత్యేక హోదా సాధించేవరకు టీడీపీ ఆందోళనకార్యక్రమాలు కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా తమ నిరసనలు ఉంటాయని తెలిపారు. జాతీయ రహదారుల దిగ్బంధనం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ బస్సులు సరిహద్దుల వరకే తిరుగుతున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు రావడం లేదు. ఏపీ వైపు సరిహద్దుల వద్ద రాజకీయనాయకులు ఎక్కడికక్కడ బైఠాయించి వాహనాలను అడ్డుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.