Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోలవరం టెండర్లు నవయుగకు దక్కాయి. కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ, జలసంఘం అధికారులతో భేటీలో నితిన్ గడ్కరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. అధికారులతో భేటీ అనంతరం మంత్రి గుత్తేదార్లతో సమావేశమయ్యారు. నవయుగ, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీల్లో వేటికి పనులు అప్పగించాలనేదానిపై చర్చించారు.
పోలవరం ప్రధాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఇప్పటివరకు అనుకున్న విధంగా నిర్దిష్టసమయంలో పనులు పూర్తిచేయకపోవడంతో నవయుగ వైపు మొగ్గుచూపారు. స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ చానల్ పనులను నవయుగకు అప్పగించాలని నిర్ణయించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2019 నాటికి పాతధరలోనే పోలవరం పూర్తిచేసేందుకు నవయుగతో అంగీకారం కుదిరింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువు ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తిచేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. వారం రోజుల తర్వాత నవయుగ సంస్థ పనులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.