ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే తనకు పదికోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీని మీద పోలీసులు కేసు నమోదు చేయాలని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాయిని నర్సింహారెడ్డి అడిగిన స్థానం ఇవ్వకుండా, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే ఖర్చులకు కేసీఆర్ పది కోట్ల రూపాయలు ఇవ్వజూపారని స్వయంగా ఆయనే చెప్పారని ఎన్నికల అధికారులు దీనిని సుమోటోగా స్వీకరించి కేసీఆర్ పై తక్షణమే కేసు పెట్టి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, ఆయన బంధువు అయిన మైహోమ్ రామేశ్వరరావు నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి కనీసం ఇరవై, ఇరవైఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారని, ఐటీ, ఈడీ దాడులు మోదీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. కొడంగల్ వంటి హోరాహోరీ నియోజకవర్గాల్లో వందకోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని, కోట్ల రూపాయలను ఈరోజు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపైనా ఎన్నికల అధికారులు నిఘా పెట్టాలని, ఐటీ అధికారులు దాడులు చేయాలని డిమాండ్ చేశారు.