టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ నియంత్రణలో నూతన పద్ధతులు అనుసరిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటిదాకా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద స్తంభాలపై ఉన్న లైట్లతోనే ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పోలీసులు.. రాత్రిపూట ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్టాప్‌లైన్‌పై లైట్లు కనబడేలా డిజిటల్, అనలాగ్ సిగ్నళ్లను ఏర్పాటుచేస్తున్నారు. ఈ విధానాన్ని బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ కూడలి వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దూరంనుంచి వచ్చేవారికి కూడా కనబడేలా డిజిటల్ లైటింగ్‌ను రోడ్డుకు అడ్డంగా పడేలా ఏర్పాటుచేశారు. రాత్రిపూట సిగ్నళ్లు సరిగా కనిపించక వాహనదారులు వేగంగా దూసుకువెళ్లి ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ముప్పును తగ్గించడంతోపాటు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా లైటింగ్‌తో స్టాప్‌లైన్ దాటి వాహనాలు నిలిపితే సీసీ కెమెరా ద్వారా ఫోటోలు తీసి చలానా విధించే అవకాశాలు ఉన్నాయి. కేబీఆర్ పార్కు సిగ్నల్ వద్ద ఏర్పాటుచేసిన వ్యవస్థ పనితీరు ఆధారంగా ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సిగ్నళ్లను ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.