Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్వాతి… రాజేష్ కేసులో అసలు నిజం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఎలా తెలిసిందన్నది అందరికీ వస్తున్న సందేహం. పక్కా స్కెచ్ తో కథ నడిపించి… రాజేశ్ కు అయిన వైద్యఖర్చుల బిల్లు రూ. 5లక్షలు సైతం సుధాకర్ రెడ్డి కుటుంబంతో చెల్లింపచేసిన స్వాతి బండారం బయటపడడానికి ఆధార్ కార్డు, మటన్ సూప్ కారణమయ్యాయి. రాజేశ్ ను హాస్పిటల్ లో చేర్చిన తర్వాత తొలి రోజుల్లో వ్యవహారం సరిగ్గానే నడిచింది. అయితే ఆస్పత్రిలో ఉన్నది సుధాకర్ రెడ్డి అనుకుని ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పరామర్శించేందుకు వచ్చి వెళ్తున్నారు.
పథకం ప్రకారం వాళ్లందరితోనూ ఏమీ మాట్లాడకుండా… వారిని ఎవాయిడ్ చేసేవాడు రాజేశ్. అలా ఆస్పత్రికి వచ్చినవారిలో సుధాకర్ రెడ్డి ఆప్తమిత్రుడు ఒకరున్నారు. ఆ స్నేహితునితో సుధాకర్ రెడ్డి అత్యంత వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకునేవాడు. స్వాతి అక్రమసంబంధం గురించి కూడా సుధాకర్ రెడ్డి అతనితో చర్చించాడు. అలాంటి సుధాకర్ రెడ్డి ఆస్పత్రిలో తనను ఎవాయిడ్ చేస్తుండడంతో స్నేహితుడికి సందేహం కలిగింది. అప్పటికే స్వాతి విషయం చూచూయగా తెలియడంతో ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్పిటల్ కు వెళ్లి రాజేశ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. వాటిని ఆధార్ డేటాతో టాలీ చేయగా..
రాజేశ్ అనే పేరుతో వివరాలు వస్తున్నాయి. వెంటనే పోలీసులు స్వాతిని విచారించడంతో విస్తుపోయే నిజం వెల్లడయింది. అలాగే సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులకు కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది సుధాకర్ కాదన్న అనుమానం రావడానికి కారణం మటన్ సూప్. సాధారణంగా చికిత్స పొందుతున్నవారికి బలవర్ధక ఆహారంగా మటన్ సూప్ ఇస్తారు. రాజేశ్ కు కూడా మటన్ సూప్ ఇవ్వబోగా… పూర్తి శాకాహారి అయిన రాజేశ్ సూప్ తాగేందుకు నిరాకరించాడు. మాంసాహారి అయిన తమ కుమారుడు మటన్ సూప్ వద్దనడం, ఎంత బలవంతం చేయబోయినా తాగకపోవడంతో వారికి తొలిసారి ఆస్పత్రి బెడ్ పై ఉంది తమ కుమారుడు కాదేమోనన్న అనుమానం వచ్చింది.
అటు వైద్యుల అనుమతి కోసం ఇప్పటిదాకా ఆగిన నాగర్ కర్నూల్ పోలీసులు ఈ ఉదయం రాజేశ్ తో మాట్లాడారు. తొలుత తాము పోలీసులమని పరిచయం చేసుకుని హాయ్ సుధాకర్ ఎలా ఉన్నావు… అని అడగగానే రాజేశ్ ఆనందంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే వెంటనే పోలీసులు కేసు విచారణ నిమిత్తం ఆధార్ ఐడింటిఫికేషన్ చేయాలని, కాసేపట్లో ఆధార్ యంత్రంతో వస్తామని చెప్పగానే రాజేశ్ హతాశుడయ్యాడని, ఏం చేయాలో, ఏం చెప్పాలో పాలుపోని స్థితికి వెళ్లాడని సమాచారం. తర్వాత కాసేపటికే స్వాతి బండారం బయటపడిందని చెప్పిన పోలీసులు రాజేశ్ వేలిముద్రలు తీసుకుని, అతను సుధాకర్ కాదన్న సాక్ష్యాన్ని అధికారికంగా నమోదుచేసుకున్నారు.