ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే మీడియా మీద పట్టు ఎంత అవసరమో ఈ పాటికే అందరికీ తెలిసొస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ కి సమవుజ్జీగా నిలవాలని తపిస్తున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కి కావాల్సినంత మైలేజ్ రాకపోవడానికి మీడియా అండ ఆ స్థాయిలో లేకపోవడమే అని అర్ధం అవుతోంది. ఈ విషయాన్ని టీవీ 9, abn మీద యుద్ధం ప్రకటించినప్పుడే పవన్ కి కూడా బాగా అవగతమైంది. ఆ లోటు పూడ్చుకోవాలంటే జనసేన కి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చే మీడియా ని పెంచుకోవాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఆ బాధ్యతను కూడా కొందరు పార్టీ ముఖ్యులకు అప్పగించారు. కొత్త ఛానల్ ఏర్పాటు లేదా ఏదైనా పాత ఛానల్ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిగాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఏపీ 24 /7 లో జనసేన సానుభూతిపరుడు ఒకరు కొంత పెట్టుబడి పెట్టినట్టు టాక్ నడుస్తోంది. అలాగే పూర్తి స్థాయి సొంత ఛానల్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే ప్రజల్లో ఎంతోకొంత ఆదరణ వున్న 10 టీవీ ని కొనుగోలు చేయడానికి జనసేన వైపు నుంచి గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఓ nri నిర్మాత ఇందుకు సంబందించిన ఆర్ధిక సహకారం అందించడానికి కూడా ముందుకు వచ్చినట్టు జనసేనలోనే జోరుగా ప్రచారం జరిగింది.
ఇక రాజకీయంగా కూడా లెఫ్ట్ తో జనసేనకు వున్న సంబంధాల రీత్యా 10 టీవీ డీల్ సులభంగా జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేసులోకి వైసీపీ అధినేత జగన్ సానుభూతిపరుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ దూసుకొచ్చినట్టు తెలుస్తోంది. జనసేనతో పోల్చుకున్నపుడు ప్రసాద్ ఇచ్చిన ఆఫర్ ఆకర్షణీయంగా ఉండడంతో 10 టీవీ యాజమాన్యం అటు వైపు మొగ్గినట్టు తెలుస్తోంది. మా టీవీ ని డెవలప్ చేసి స్టార్ కి పెద్ద మొత్తంలో అమ్మడం ద్వారా మ్యాట్రిక్స్ ప్రసాద్ మీడియా రంగ నిర్వహణలోనూ అనుభవం వుంది. అదే ఆలోచనతో మ్యాట్రిక్స్ ప్రసాద్ పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చారని టాక్. కానీ లోపాయికారీగా ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. పవన్ నేతృత్వంలోని జనసేనకు మీడియా అండ తోడు అయితే తమకు పోటీ అవుతుందన్న భావనతో వైసీపీ పరోక్షంగా మ్యాట్రిక్స్ ప్రసాద్ ని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఈ వాదనలో నిజం ఉందని తెలిస్తే అసలే ఛానల్ డీల్ ఫెయిల్ అయిన బాధలో వైసీపీ మీద పవన్ ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి. కానీ ఇంకో వాదన కూడా లేకపోలేదు. ఆపరేషన్ గరుడ లో భాగంగా పవన్ కి వైసీపీ పరోక్ష సహకారం అందించడానికి 10 టీవీ డీల్ ఓ సాక్ష్యం అనే వాళ్ళు లేకపోలేదు. మొత్తానికి ఈ వాదనలు ఏది నిజమో, ఏది పుకారో కాల పరీక్షలో తేలాల్సిందే.