Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళను వణికిస్తున్న ప్రాణాంతక నిఫా వైరస్ ఓ కుటుంబంలో నాలుగో వ్యక్తినీ బలితీసుకుంది. నిఫా వైరస్ సోకడంతో మూడువారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 62 ఏళ్ల మూస మృతిచెందారు. ఆయన కుటుంబంలో ఇది నాలుగో మరణం. మూడువారాల క్రితం మొదటగా నిఫా లక్షణాలతో మూస ఆస్పత్రిలో చేరారు. అప్పటికి ఈ వ్యాధి గురించి ఎవరికీ తెలియదు. మూసకు నిఫా సోకినట్టు గత సోమవారం వైద్యులు ధృవీకరించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి లైఫ్ సపోర్ట్ పై ఉన్న మూస ఇవాళ చనిపోయారు. ఆయన ఆస్పత్రిలో చేరిన కొన్నిరోజులకు కుమారులు మహ్మద్ సాలియా, సాధిక్, కోడలు మరియమ్మ అనారోగ్యానికి గురయ్యారు. వారిని కూడా మూస చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే చేర్చారు. రెండు వారాల వ్యవధిలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. నిఫా వైరసే వారిని బలితీసుకుందని వైద్యులు తెలిపారు.
నిఫా వైరస్ కారణంగా మరణించిన నర్సు లినీ చికిత్స అందించింది మూస కుటుంబసభ్యులకే. వారికి సేవలు చేస్తున్న సమయంలోనే ఆమెకూ ఈ వైరస్ సోకింది. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం ఈ వైరస్ కారణంగా కేరళలో 12 మంది మృతిచెందారు. అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువని ప్రచారం జరుగుతోంది. మూస కుటుంబ సభ్యులు, నర్సు లినీ మరణాలతో అప్రమత్తమైన కేరళ ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రజలకు ఆరోగ్య హెచ్చరికలు జారీచేశారు. నిపా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. మూస ఇంటిలోని బావిలో ఉన్న గబ్బిలాల నుంచి వారికి నిఫా వైరస్ సోకిందని నిర్ధారించిన అధికారులు ఆ బావిని మూసివేశారు. మూస ఇంటికి తాళం వేశారు.