Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిపా అనే అరుదైన వైరస్ కేరళను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా 15 రోజుల్లో నలుగురు మరణించారు. వ్యాధి సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మరో 8 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మరొకరు… వారు చికిత్స పొందుతున్న సమయంలో సేవలు చేసిన నర్సు లినీ. ఆమె మృతిచెందిన తర్వాత ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిపై కేరళ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నిపా వైరస్ సోకి ఈ నెల 5న 23 ఏళ్ల యువకుడు, ఈ నెల 18న అతని అన్న, 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. వారి బాగోగులు చూసిన నర్సు లినీ సోమవారం మృతిచెందారు. ఒకరి నుంచి మరొకరికి నిపా వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో కుటుంబ సభ్యులకు కనీసం ఆఖరిచూపైనా లేకుండా లినీ భౌతికకాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు.
నిపా వైరస్ వ్యాప్తిపై కేరళ పీఎం పినరయి విజన్ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్టు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ చెప్పారు. కేంద్రం కూడా దీనిపై స్పందించింది. శైలజతో మాట్లాడి వైరస్ గురించి తెలుసుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి వైద్యుల బృందాన్ని కోజికోడ్ పంపించారు. నిపా వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ ను 1998లో మలేషియాలోని కాంపుంగ్ సుంగై నిపా అనే ప్రాంతంలో మొదటగా గుర్తించడంతో వైరస్ కు ఆ పేరే పెట్టారు. మలేషియాలో ఇది పందుల ద్వారా వ్యాపించినట్టు గుర్తించారు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులకు దగ్గరగా మసలడం, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లు తినడం, వైరస్ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది.
ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ సోకినవారిలో సగటున 70 శాతం మంది మరణించే అవకాశాలు ఉన్నాయి. భారత్ లో తొలిసారి 2001లో పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఈ వైరస్ కనిపించింది. అప్పట్లో 66 మందికి ఈ వ్యాధి సోకగా 45 మంది మృత్యువాతపడ్డారు. తర్వాత 2007లోనూ పశ్చిమబెంగాల్ లోనే ఈ వైరస్ వెలుగుచూసింది. కాగా కేరళలో నిపా వైరస్ ను గుర్తించడం ఇదే తొలిసారి.
నిపా వైరస్ లక్షణాలు
జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు నిపా వైరస్ లక్షణాలు. ఎప్పుడుచూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈ వ్యాధి లక్షణం. వైరస్ సోకిన ఐదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం, పండ్లు, కూరగాయలను శుభ్రపరిచిన తర్వాతే తినడం, చేతులను ఎక్కువసార్లు సబ్బుతో కడుక్కోవడం, గబ్బిలాలు తినే మామిడిపండ్లు, రోజ్ ఆపిల్స్ వంటివాటిని తీసుకునేటప్పుడు శుభ్రంగా కడగడం ద్వారా నిపా వైరస్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు.