Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కుమారుడు ఆకాశ్ తాను ప్రేమించిన అమ్మాయి శ్లోకతో పెళ్లిపీటలెక్కబోతున్న తరుణంలో తల్లి నీతా అంబానీ కాబోయే జంటకు ఓ లేఖ రాశారు. ఆకాశ్, శ్లోక చిన్ననాటి సంగతులను, కొత్త కోడలికోసం తామంతా ఎదురుచూస్తున్న వైనాన్ని లేఖలో వివరించింది. ఏబీసీడీలు చదువుకోడానికి పాఠశాలకు వెళ్లారని, అప్పట్లో వారికి భవిష్యత్ ఎలా ఉండబోతుందో తెలీదని, అయితే చిన్నప్పుడు వారు తిన్న జెల్లీ బీన్స్, చాకొలెట్స్ వారి జీవితాలను మధురంగా మార్చాయని నీతా అంబానీ తన లేఖలో సంతోషం వ్యక్తంచేశారు. ఆకాశ్, శ్లోక చిన్నప్పుడు వేసుకున్న పోనీటెయిల్స్, ఆడుకున్న బార్బీ బొమ్మలు, చిన్న చిన్న గొడవలు..ఇవన్నీ జరిగి ఏళ్లు గడిచిపోయాయని, ఈ రోజు ఇద్దరూ పెద్దవారయ్యారని, వారికళ్లలో ప్రేమ దాగి ఉందని నీతా కాబోయే దంపతుల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఆకాశ్, శ్లోక ఇద్దరి హృదయాలు ఇప్పుడు ఒక్కమాటే కోరుకుంటున్నాయని, నన్ను పెళ్లిచేసుకుంటావా అన్నదే ఆ మాటని, వారిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని, ఎల్లప్పుడూ ఒకరికొకరు ఇలా తోడుగా ఉంటారని ఆశిస్తున్నామని నీతా తన లేఖలో ఆకాంక్షించారు. ఆకాశ్ పెళ్లిపై తల్లి నీతాతో పాటు కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది. ఆకాశ్ సోదరి ఇషాకయితే జీవితంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత సంతోషకరమైన విషయం అనిపిస్తోంది.
ఆకాశ్,శ్లోక వివాహం జరగబోతున్నందుకు తాను, అనంత్ చాలా సంతోషిస్తున్నామని, ఇప్పుడు కలిగినంత ఆనందం ఇదివరకెప్పుడూ కలగలేదని చెప్పింది. శ్లోకను వదిన అని పిలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని, శ్లోక తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆమె సోదరి దియా తాను కలిసే చదువుకున్నామని, ఒక్క మాటలో చెప్పాలంటే తాను, శ్లోక, దియా అక్కాచెల్లెళ్లలా ఉంటామని ఇషా చెప్పింది. శ్లోక తమ ఇంట్లోకి వస్తున్న సందర్భంగా తమ కుటుంబం పరిపూర్ణమయినట్టుగా ఉందని ఇషా సంతోషం వ్యక్తంచేసింది. ఆకాశ్, శ్లోక వివాహం డిసెంబర్ లో ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. శ్లోక ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. ధీరూభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కలిసి చదువుకునే రోజులనుంచి ఆకాశ్, శ్లోక ప్రేమించుకున్నారు.