నేడే అవిశ్వాసం…ఎవరి బలం ఎంతంటే ?

no-confidence-motion-in-parliament-today

ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో ఎన్డీయే నుండి బయటకు వచ్చిన టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగనుంది. అయితే చర్చతో పాటు, ఓటింగ్ కూడా జరగనున్న నేపధ్యంలో ఎవరి బలాలు ఏమిటా అన్న ఆసక్తి మొదలయ్యింది. సాధారణంగా అయితే ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం అంటే అది ఒక సంచలనమే. కానీ ప్రస్తుత అవిశ్వాస తీర్మానం ఇప్పుడు మరీ అంత సంచలన అంశం కాదు. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ కి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. ఎన్డీయే రూపంలో దాని బలం మరింత పెరుగుతుంది. ఇప్పుడు అవిశ్వాసం వల్ల మోడీ ప్రభుత్వానికి ఢోకా లేదు. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న మొత్తం ఎంపీల సంఖ్య 534. ఇటీవలై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారు.

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. వీరితో పాటు మరి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 534కు చేరింది. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కనీసం 268 మంది ఎంపీల బలం అవసరం. అయితే ఎన్డీయేతర పార్టీల వద్ద ఇంతమంది సభ్యులు లేరు. యూపీఏ కూటమిలోని పార్టీల మొత్తం ఎంపీల సంఖ్య 66. టీఎంసీ కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంది ఆ పార్టీ ఎంపీల సంఖ్య 34. టీడీపీకి లోక్‌సభలో 15మంది ఎంపీలున్నారు. ఇక ఎస్పీకి ఏడుగురు, ఆమ్ ఆద్మీ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు. కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్ఎస్, బీజేడీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతునిచ్చినా 268 మంది ఎంపీల బలం అయితే లభించదు. దీంతో అవిశ్వాసం అయితే గెలిచే పరిస్థితి లేదు.