అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తంటారు. లోపలేం దాచుకోరు. ఆయనదో నైజం. మొన్న ఆందోళనకారులకు భయపడి బంకర్లో దాక్కున్న ట్రంప్… దానిపైనా తనదైన స్టైల్లో తెలివిగా స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా తన పరువు పోయిందని భావించాడో ఏమోగానీ.. కాస్త క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. తాను భయంతో బంకర్లోకి వెళ్లలేదని.. జస్ట్ చూడ్డానికి మాత్రమే వెళ్లానని అన్నారు. అది కూడా పగటి పూటేనంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా గతంలో కూడా రెండుమూడు సార్లు అక్కడకు వెళ్లొచ్చానని తెలిపిన ట్రంప్.. బంకర్ కు వెళ్లడం పెద్ద విషయం కాదని వెల్లడించారు. తన గురించి ఎలాంటి న్యూస్ రాశారో చదివానని.. తన దగ్గరకు వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరని అన్నారు. కాగా ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా మొన్న వైట్‌హౌస్ ముందు ఆందోళనలు జరిగాయి. బారికేడ్లకు నిప్పులు పెట్టారు. దీంతో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌గా పిలిచే బంకర్లోకి ట్రంప్‌ను తీసుకెళ్లారు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అయితే శుక్రవారం రాత్రి అధ్యక్షుడు వెళ్లినట్లు అమెరికా మీడియా ప్రసారం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగింది. సాధారణంగా ఉగ్రదాడుల వంటి ఘటనలు జరిగిన సమయంలోనే అధ్యక్షుడు శ్వేతసౌధంలోని ఈ బంకర్లోకి వెళ్తారు. సురక్షిత స్థావరం కావడంతో అక్కడి నుంచే తన అధికారిక కార్యకలాపాలను నిర్వహిస్తారు. ట్రంప్ ని బంకర్ లోకి తరలించటంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయిపోయింది. వైట్ హౌస్ లో బంకర్ ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1940లో రూజ్వెల్ట్ హయాంలో నిర్మించారు. మరో ఎనిమిదేళ్లకు అంటే 1948లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ దీంట్లో ఇంకొన్ని మార్పులు చేశారు. శ్వేతసౌధం తూర్పు భాగంలో భూమి లోపల శత్రుదుర్భేద్యంగా దీన్ని నిర్మించడం జరిగింది.