Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా అధ్యక్షుడు శత్రువుల విషయంలో చాలా ప్రమాదకారి. ఆ విషయం ప్రపంచానికంతటికీ తెలుసు. అయితే సాధారణ శత్రువులనే కాదు… కుటుంబంలోని ప్రత్యర్థుల విషయంలో కూడా ఆయన అంతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సొంత మేనమామను వేటకుక్కలకు ఆహారంగా వేశాడని తెలిసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. అలాగే మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ ను హత్యచేయించారు. అయితే ఈ హత్య ఎంత వ్యూహాత్మకంగా చేశారో అమెరికా గూఢాచార సంస్థ సీఐఏ దర్యాప్తులో వెల్లడయింది. కిమ్ జోంగ్ నామ్ హత్యకు కిమ్ జోంగ్ ఉన్ ప్రాంక్ ఐడియా ఉపయోగించి అమాయకులతో హత్య చేయించాడని తేలింది. ప్రాంక్ ఐడియా అంటే..బహిరంగ ప్రదేశాల్లో కెమెరాను రహస్యంగా ఉంచి… మనుషుల ప్రవర్తనను గమనించడం. ఉదాహరణకు మనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే అకస్మాత్తుగా ఓ వ్యక్తి మన ముందు ప్రత్యక్షమై మనల్ని చెంపదెబ్బ కొడతారు. మనం కోపంతో రియాక్టయ్యే లోపు కెమెరాతో కొందరు ప్రత్యక్షమై ప్రాంక్ అని సర్దిచెబుతారు. తర్వాత అందరూ కలిసి నవ్వుతూ కెమెరాకు ఫోజులిస్తారు.
తెలుగులో కూడా గతంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చానళ్లలో ప్రసారమయ్యేవి. ఈ ఐడియానే కిమ్ జాంగ్ ఉన్ తన సవతి సోదరుణ్ని హత్య చేయించడానికి ఉపయోగించాడు. ఇందుకోసం కిమ్ ఏజెంట్లు మలేషియాలో స్థానికంగా ఉండే ఇద్దరు మహిళలను ఎంచుకున్నారు. వీరిలో ఒకరు మసాజ్ పార్లల్ లో పనిచేస్తుండగా.. మరొక మహిళ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తోంది. తాము ఒక టీవీ ప్రాంక్ చేస్తున్నామని, అందులో నటించాలని కిమ్ ఏజెంట్లు ఆ మహిళలను కోరారు. ఇందులో నటించినందుకు గానూ 90 డాలర్లు ఇస్తామని, టీవీలో కనిపించే అవకాశం కూడా వస్తుందని ఆ మహిళలకు ఆశపెట్టారు. దీనికి ఇద్దరు మహిళలు అంగీకరించారు. వారికి నూనె వంటి రసాయనాలు ఇచ్చి కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో కిమ్ జోంగ్ నామ్ ముఖంపై వేసి వెళ్లిపోవాలని సూచించారు. వీరిని మరో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా అనుసరించారు. చెప్పినట్టే ఆ మహిళలు రసాయనాలను కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో నామ్ ముఖంపై వేసి డిపార్చర్ గేటు నుంచి వేగంగా వెళ్లిపోయారు. అనంతరం నామ్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
వీఎక్స్ అనే రసాయన ప్రయోగం వల్లే అతడు చనిపోయినట్టు దర్యాప్తులో తేలింది. అయితే వీఎక్స్ రసాయనాన్ని ఇతరుల మీద చల్లితే..ఆ రసాయనం పడ్డ వ్యక్తులతో పాటు… ప్రయోగించిన వ్యక్తులు కూడా ఆ ప్రభావానికి గురై మరణిస్తారు. కానీ నామ్ పై రసాయనం వేసిన ఇద్దరు మహిళలు సురక్షితంగానే ఉన్నారు. దర్యాప్తు సంస్థలు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. కిమ్ జోంగ్ ఉన్ సోదరుణ్ని హత్యచేసేందుకు వేసిన ప్రాంక్ ఐడియా దర్యాప్తు సంస్థలకు అర్దమయింది కానీ…హత్యకు ఉపయోగించిన రసాయనమేంటో అంతుచిక్కలేదు. మరింత లోతుగా పరిశోధనలు జరపగా..దిమ్మతిరిగే విషయం బయటపడింది. ఈ హత్యకు బైనరీ ఫామ్ అనే వ్యూహాన్ని వాడినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలకు కిమ్ ఏజెంట్లు చెరో రకం రసాయనాన్ని ఇచ్చారు. వాటిని కిమ్ జోంగ్ నామ్ ముఖంపై పోయగానే అవి రెండూ కలిసిపోయి క్షణాల్లోనే వీఎక్స్ గా మారి అతని ప్రాణాన్ని తీశాయి.
బైనరీ ఫామ్ వల్ల రసాయనాలు ప్రయోగించిన వాళ్లకు ఎలాంటి ప్రాణహానీ ఉండదు. అలా ఆ మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే ఈ హత్యలో మరోకోణం కూడా ఉంది. కిమ్ జోంగ్ ఉన్ తలచుకుంటే సోదరుణ్ణి అత్యంత రహస్యంగా అంతమొందించి ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా కూడా జాగ్రత్త పడగలడు. అయితే నామ్ హత్య, అందుకు ఉపయోగించే విధానం ద్వారా ఉత్తరకొరియా ప్రత్యర్థి దేశాలైన అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ లకు పరోక్ష హెచ్చరికలు పంపాలన్నది ఉన్ వ్యూహం. బహిరంగంగా ఇలా హత్య చేయిస్తే..దర్యాప్తులో హత్యకు ఉపయోగించిన రసాయనం గురించి బయటపడి శతృదేశాలు భయపడతారన్నది కిమ్ వ్యూహమని సీఐఏ విశ్లేషించింది.