Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జైలవకుశ సినిమా హిట్ అయ్యాక కూడా కొత్త సినిమా మొదలు పెట్టకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత సమయం ఖాళీగా ఉండటానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ తో కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ కావడానికి ఎన్టీఆర్ వైపు నుంచి జరిగిన ప్రయత్నమే ఎక్కువ అని ఫిలిం నగర్ అప్పుడు కోడై కూసింది. ఏమైతేనేం ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యింది. త్వరలో షూటింగ్ మొదలు అవుతుందన్న తరుణంలో అజ్ఞాతవాసి విడుదల , ప్లాప్ టాక్ తో ఎన్నో మాటలు.ఇంకెన్నో పుకార్లు. త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఓకే అంటాడా అని ప్రశ్నలు తలెత్తాయి. కాస్త జాగ్రత్త అంటూ ఫాన్స్ కూడా ఎన్టీఆర్ కి మెసేజ్ లు పంపుతున్నారు. ఇలా ఒక్క సినిమాతో, ఒక్క ఫలితంతో అందరివాడు అనుకున్న త్రివిక్రమ్ మీద విమర్శకులు విరుచుకుపడుతున్నారు. ఈ టైం లో ఎన్టీఆర్ ఏమి చేస్తాడు అన్న డౌట్ అందరి మదిలో వుంది.
ఒక ప్లాప్ రాగానే త్రివిక్రమ్ ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు మాట్లాడేవాళ్లంతా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మహామహులనుకున్న దర్శకులు చాలా మంది కూడా ఏదో ఒక దశలో ప్లాప్స్ ఇచ్చిన వాళ్లే. తెలుగులో వందకుపైగా సినిమాలు చేసిన దాసరి , రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ , కె.ఎస్.ఆర్. దాస్ లాంటి దర్శకులు సైతం చాలా ప్లాప్స్ ఇచ్చారు. మంచి ఫామ్ లో వున్నప్పుడే దాసరి చిరంజీవితో చేసిన లంకేశ్వరుడు ప్లాప్ అయ్యింది. హిట్ కాంబినేషన్ అనుకున్న రాఘువేంద్రరావు కూడా చిరంజీవికి రుద్రనేత్ర వంటి అట్టర్ ప్లాప్ ఇచ్చాడు. ఇక కోడిరామకృష్ణ మెగా స్టార్ తో చేసిన అంజి రిజల్ట్ గురించి వేరే చెప్పాలా ? అంత మాత్రాన వీళ్ళు ఇక దేనికి పనికిరారు అందామా ? ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అంతే. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే బ్యాట్స్ మెన్ ఫామ్ టెంపరరీ, ఆయన స్టాండర్డ్స్ శాశ్వతం. అలాగే ఒక్క ప్లాప్ ఇచ్చినంత మాత్రాన త్రివిక్రమ్ చేవ చచ్చినట్టు కాదు.
ఈ తరం నటుల్లో ఆణిముత్యం లాంటి ఎన్టీఆర్ కూడా సింహాద్రి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఇంకో హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ పరాజయపు భారం ఎలా ఉంటుందో, దాని నుంచి బయటపడేందుకు ఎంత కసితో పనిచేస్తారో ఎన్టీఆర్ కి ఇంకొకరు చెప్పాలా ? పైగా త్రివిక్రమ్ లాంటి మేధావి ఇంకొకరు చెప్పేదాకా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా వుంటారా ? ఈ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలుసు. అందుకే త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ నేరుగా ఫోన్ చేశారు. ప్లాప్ విషయం మర్చిపోయి కొత్త సినిమా కోసం హాయిగా పని చేయండి అని ధైర్యం చెప్పారట. ఎన్టీఆర్ మాటలతో త్రివిక్రమ్ కూడా నార్మల్ మూడ్ లోకి వచ్చారట.అందుకే అజ్ఞాతవాసి ఫలితం బాగా లేకున్నా ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ సినిమాలో ఏ మార్పు ఉండదు.ఉండబోదు.