“ స్పర్దయా వర్ధతే విద్య “ అన్న సంస్కృత నానుడిని నారాయణ , చైతన్య నిజం చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఈ కార్పొరేట్ విద్యాలయాల మధ్య పోటీ ర్యాంకులకే, ర్యాంకులు సాధించిన విద్యార్థులకే అనుకున్నాం. కానీ తాజాగా నారాయణ మొదలెట్టిన ఇంకో పోరాటం పోటీ పరీక్షల విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేలా వుంది. ఈ రెండు కార్పొరేట్ కాలేజీల మధ్య తాజా యుద్ధం మాత్రం ప్రతిభ వున్న విద్యార్థికి పట్టం కట్టే దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ విద్యాలయాల మధ్య తాజా యుద్ధం ఎందుకో తెలుసా?
ఇటీవల విడుదల అయిన NTSE స్టేజ్ 1 పరీక్షా ఫలితాలు వచ్చాయి. అందులో చైతన్య విద్యార్థులు పెద్ద ఎత్తున రెండో స్థాయి పరీక్షకు అర్హత సాధించారు. సెకండరీ స్కూల్ స్థాయిలో ప్రతిభ గల విద్యార్ధులకి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినందుకు చైతన్య కాలరు ఎగరేయాలి. కానీ వివరణ ఇచ్చే పరిస్థితుల్లో నిలబడింది. అందుకు గల కారణాలు తెలిస్తే నోరు వెళ్ళబెట్టడం మన వంతు అవుతుంది. ఈ రేసులో చైతన్య దూసుకెళ్లడానికి సెల్ఫ్ సెంటర్స్ అని నారాయణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. సెల్ఫ్ సెంటర్స్ లో అక్రమాలకు పాల్పడి స్టేజ్ 1 లో మంచి ఫలితం తెచ్చుకున్న విద్యార్థుల వల్ల నిజంగా ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇక తొలి స్టేజ్ లో అక్రమాలతో గట్టు దాటిన వాళ్ళు రెండో స్టేజ్ లో నోరు వెళ్ళబెట్టేస్తున్నారు. ఇలా ఒక అక్రమం వల్ల రెండు విధాలుగా నష్టం.
ఈ విషయాన్ని హైలైట్ చేయడం ద్వారా సెల్ఫ్ సెంటర్ విధానానికి స్వస్తి పలికేలా ఒత్తిడి తెచ్చేందుకు నారాయణ గళం ఎత్తింది. ఏ ప్రయోజనం కోసం ఈ పోరాటం మొదలు అయినప్పటికీ దీని వల్ల ప్రతిభకు జరిగే మేలుని దృష్టిలో ఉంచుకుని విద్యావేత్తలు ఇందులో భాగం కావడానికి సంసిద్ధం అవుతున్నారు. ఇక పిల్లలు, తల్లిదండ్రులు కూడా సెల్ఫ్ సెంటర్ విధానం వల్ల జరిగే అనర్ధాల్ని ప్రశ్నించడమే కాదు. ఈ రోజుల్లో ఇంత ప్రతిష్టాత్మక పరీక్షలకు ఆన్ లైన్ విధానాన్ని అనుసరించకుండా అక్రమాలకు అవకాశం ఇవ్వడాన్ని నిలదీస్తున్నారు. ఏమైతేనేమి… ఈ కార్పొరేట్ విద్యాలయాల మధ్య యుద్ధంతో నిజమైన ప్రతిభకు పట్టాభిషేకం జరిగితే అంతకు మించిన మేలు ఏముంటుంది ?