బాబుకి మరో తలనొప్పి !

CBN Master Plan On BJP

అసలే పార్టీ నుంచి పలువురు నేతలు జంప్ చేయడంతో సతమవుతున్న చంద్రబాబుకి మరో కొత్త తలనొప్పి మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలంతా అలకపాన్పులు ఎక్కుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఎలా వ్యవహరించినా ఇన్నాళ్లూ పట్టించుకోని నేతలు ఇప్పుడు అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ కాగా.. మరికొందరు కూడా పార్టీని వీడనున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అత్యంత సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. తాజాగా అశోక్ గజపతి రాజు అలకబూనారట. చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి అశోక్‌గజపతి రాజు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై ఆయన అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. తన పార్లమెంట్‌ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్‌గజపతి రాజు రాకపోవడానికి కూడా కారణం అదేనని అదేంటంటే కిశోర్‌ చంద్రదేవ్‌ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి రాజు మధ్య దూరం పెరగడానికి మరో కారణమని అంటున్నారు. తాము రాజ‌కీయంగా విబేధించిన కాంగ్రెస్ నేత కిషోర్ చంద్ర దేవ్ టీడీపీలో చేర‌టానికి సీఎం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌టాన్ని అశోక్‌గజపతి రాజు త‌ప్పు బ‌డుతున్న‌ట్లు స‌మాచారం. కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరనున్న వ్యవహారంపై తనతో చర్చించకపోవడాన్ని అశోక్ గజపతిరాజు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల రీత్యా ఆయన పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు.