Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రత్యేక హోదా సాధనసమితికి మద్దతుగా వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన బంద్ లో పాల్గొంటున్నాయి. బంద్ సందర్భంగా, వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షలు వాయిదాపడ్డాయి. చాలా చోట్ల వ్యాపారస్తులు స్వచ్ఛందంగానే దుకాణాలు మూసివేశారు. అఖిలపక్షనేతలు తెల్లవారుజామునుంచే బస్ డిపోల వద్ద బైఠాయించడంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కటట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. అన్ని ఆర్టీసీ డిపోలతో పాటు ప్రధాన కూడళ్లలో తెల్లవారుజామునుంచే పోలీసులు మోహరించారు. శ్రీకాకుళం బస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత తమ్మినేని సీతారాం, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు, మరికొందరు కార్యకర్తలు బస్సులను అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైసీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించాయి. బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నగరాలైన రాజమహేంద్రవరం, కాకినాడతో పాటు కోనసీమలోనూ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపార, విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి.
పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. నేతలు, కార్యకర్తలు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తెల్లవారుజామునుంచీ నిరసనలు హోరెత్తాయి. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు మూతపడ్డాయి. పలుచోట్ల నేతలు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి నిరసనలు వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విభజన హామీలు అమలు చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేతలు నినదించారు. తెలుగు ప్రజలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్రమోడీ బచావో, నరేంద్రమోడీ డౌన్ డౌన్, ప్రత్యేక హోదా మన హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ప్రకటనచ వచ్చేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుందని సీపీఐ, సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలు కేంద్రప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు.