Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ… దాయాది దేశం తమ గొడవలోకి భారత్ ను లాగుతోంది. ట్రంప్ విమర్శలపై పార్లమెంటరీ కమిటీతో మాట్లాడుతూ పాక్ విదేశాంగమంత్రి ఖ్వాజా అసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. అఫ్ఘానిస్థాన్ లో అమెరికా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ట్రంప్ తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించిన అసిఫ్ ట్రంప్ కూడా భారత్ భాషలో మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. భారత్, అమెరికాల మధ్య ఉన్న సంబంధాల వల్ల అమెరికా ఆ దేశ భాష మాట్లాడుతోందని విమర్శించారు. అటు పాకిస్థాన్ కు అమెరికా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది.
పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోందని, ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహిస్తూ ఇప్పటికే ఆ దేశానికి 255 మిలియన్ డాలర్ల సైనికసహాయాన్ని నిలిపివేసిన అమెరికా తాజాగా 900 మిలియన్ డాలర్ల భద్రతా సహకారాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. పాక్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ తాలిబన్లు, హక్కాని నెట్ వర్క్ తదితర ఉగ్రవాద సంస్థలపై తగిన చర్యలు తీసుకునేంత వరకు పాక్ కు ఆర్థిక, భద్రత సహకారాలు నిలిపివేస్తామని అమెరికా స్టేట్ డిపార్డ్ మెంట్ అధికార ప్రతినిధి హీతర్ వెల్లడించారు. పాక్ అండదండలతో ఉగ్రవాదులు అమెరికా దళాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాక్ కు ఇకముందు మిలటరీ పరికరాలు సహా భద్రతాపరమైన ఎలాంటి సహకారం అందబోదని స్పష్టంచేశారు.