తమిళనాడు ముఖ్యమంత్రి ఎడుప్పడి పళని స్వామికి కాలం కలిసి వస్తున్నట్టు లేదు, మొన్నటి దాకా జయ పార్టీలోని రెబల్ వర్గమైన దినకరన్ వర్గం ఒక పక్క, పన్నీర్ వర్గం ఒకపక్క విమర్శలు చేస్తూ రాగా ఇప్పుడు కరుణ అంత్యక్రియల విషయంలో కక్ష సాధింపు చర్యలు చేపట్టి రజనీకాంత్ సహా అందరి చేతా మాట పడాల్సి వస్తోంది. తాజాగా పళనిస్వామిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నిప్పులు చెరిగారు. మెరీనా బీచ్ లో అన్నాదురై సమాధి పక్కన ఆయన సమాధిని ఏర్పాటు చేయాలన్న కరుణానిధి కోరికని ఆయన చివరి క్షణాల్లో పళనిస్వామి దృష్టికి తీసుకొచ్చానని, చేతులు పట్టుకుని మరీ వేడుకున్నానని, అయినా తన అభ్యర్థనను అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెరీనా బీచ్ లో కరుణ అంత్యక్రియలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక పూర్తి క్రెడిట్ లాయర్లకే దక్కుతుందని అన్నారు. డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాలు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాక ఒక నేతను డీఎంకే కోల్పోతే, తాను తండ్రిని కూడా కోల్పోయానని ఈ సందర్భంగా స్టాలిన్ కంటతడి పెట్టారు. కరుణ ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని చెప్పారు. కరుణ ఆశయాల సాధన కోసం అందరం కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు.