తమిళ పాలిటిక్స్ ని జాతర చేసిన బీజేపీ ఆశ

BJP party Hopes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పురుచ్చితలైవి జయ మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో పట్టు పెంచుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయని ప్రయత్నం లేదు. కానీ వాళ్ళ ఒక్కో ప్రయత్నం ఇంకాస్త పోటీ పెంచుతోంది తప్ప బీజేపీ పరిస్థితి అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. బీజేపీ ప్రయత్నాలతో తమిళనాట ఏర్పడిన రాజకీయ అనిశ్చితి చూసి తాను కూడా ఓ రాయి వేద్దామని ముందుగా రజని, ఆ తర్వాత కమల్ పార్టీ ఏర్పాటుకి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రజని తనకున్న తమిళేతరుడు అన్న ముద్ర తో ఇంకా సంశయిస్తున్నారు. కమల్ మాత్రం దూకుడుగా ముందుకు రావడమే కాదు కేజ్రిని, వామపక్ష నేతల్ని కలవడం ద్వారా తాను బీజేపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తానని చెప్పాడు. 
   
శశి రాజకీయం, జల్లికట్టు ఉద్యమం, రజని, కమల్ రాజకీయ ఆసక్తి…ఇన్ని పరిణామాలు చూసాక అయినా బీజేపీ వైఖరి మార్చుకోలేదు. తాజాగా మరో ఇద్దరు హీరోల్ని కూడా రాజకీయాల్లోకి లాగేసి తమిళ పాలిటిక్స్ లో సినీ జాతర చేయిస్తోంది. జీఎస్టీ, వైద్య విధానం గురించి తమిళ్ హీరో విజయ్ సినిమా మెర్సెల్ లో కొన్ని డైలాగ్స్ ఉంటే వాటిని పట్టుకుని రాద్ధాంతం చేసింది. దాంతో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమాని తమిళ తంబీలు సూపర్ డూపర్ బంపర్ హిట్ చేసేసారు. దీంతో విజయ్ మనసు కూడా రాజకీయాల మీదకి మళ్లింది. ఆయన తండ్రి ఇప్పటికే ఓ స్టేట్ మెంట్ ఇస్తే, బీజేపీ కి చురక పడేలా విజయ్ కూడా సినిమా విజయానికి దోహదం చేసిన వారికి థాంక్స్ చెబుతూ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ సినిమా మీద వివాదాలు కూడా వచ్చాయంటూ బీజేపీ ని గిచ్చి వదిలిపెట్టారు. త్వరలో విజయ్ రాజకీయ రంగప్రవేశం ఉండొచ్చు. ఇక విజయ్ కి అండగా మాట్లాడారని విశాల్ మీద జీఎస్టీ దాడులు జరిపించారు. దీంతో ఆయన మీద తమిళనాట సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆయన్ని కూడా పాలిటిక్స్ రా రమ్మంటున్నాయి. వీరికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు కూడా సినీ రంగం నుంచి రాజకీయాల వైపు చూస్తున్నారు. మొత్తానికి బీజేపీ ఇదంతా బీజేపీ పాపమే. కానీ ఆ పాపానికి ఫలితం అనుభవిస్తోంది ఆ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు డీఎంకే, అన్నాడీఎంకే. కొత్త నీళ్లు ఉధృతిగా వస్తుంటే వాటి అస్తిత్వమే ఇప్పుడు ప్రమాదంలో పడింది. తమిళనాడుకి సంబంధించి బీజేపీ కొండకి తాడు కట్టి లాగింది. ఆ తాడు తెగిపోయింది. అంతే.