Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప తమిళనాడు రాజకీయాల్లో శశికళ చాప్టర్ ఇక క్లోజ్ అయినట్టే. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నాడీఎంకె ప్రకటించింది. శశికళను పార్టీ నుంచి బర్తరఫ్ చేయటాన్ని అన్నాడీఎంకెలో ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ దివంగత ముఖ్యమంత్రి జయలలితదే అని సమావేశంలో తీర్మానించారు. పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ గా పన్నీర్ సెల్వం, అసిస్టెంట్ చీఫ్ కో ఆర్డినేటర్ గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం తెలిపింది. అమ్మ గతంలో నియమించిన వారు తమ పదవుల్లో కొనసాగనున్నారు. రెండాకుల గుర్తు కూడా తమకే చెందుతుందని సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది.
శశికళ మేనల్లుడు దినకరన్ చేపట్టిన నియామకాలను పార్టీ ఆమోదించబోదని స్పష్టంచేసింది. ఈ సమావేశానికి పళనిస్వామి, పన్నీర్ వర్గానికి చెందిన నేతలందరూ హాజరయ్యారు. జయలలిత మరణించిన దగ్గర నుంచి తమిళనాడులో రాజ్యమేలుతున్న రాజకీయ అనిశ్చితి అన్నాడీఎంకె సర్వసభ్యసమావేశంతో ముగిసిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జయలలిత మరణించేంతవరకు అన్నాడీఎంకెలో తెర వెనక చక్రం తిప్పిన శశికళ…ఆ తర్వాత ఒక్కసారిగా తన అసలు రూపం బయటపెట్టారు. జయలలిత అంత్యక్రియలు నిర్వహించకముందే అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ…ఆ తర్వాత తన జీవిత కోరిక అయిన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేందుకు ఎక్కువ కాలం వేచిచూడలేకపోయారు. పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న శశికళకు కేంద్రం మద్దతుతో పన్నీర్ షాకిచ్చారు.
అమ్మకు వీర విధేయుడుగా పేరున్న పన్నీర్ సెల్వం చిన్నమ్మపై మాత్రం తిరుగుబావుటా ఎగురవేశాడు. దీంతో అన్నాడీఎంకె రెండుగా చీలిపోయింది. అత్యాశ పడిన శశికళకు ముఖ్యమంత్రి కావాలన్నకోరిక తీరకపోగా…చివరకు అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిసార్టు రాజకీయాలు నడిపి శశికళ పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా…చివరకు ఆయన కూడా ఎదురు తిరగడంతో జైలులో ఉన్న శశికళకు అన్నాడీఎంకెపై పట్టు తప్పింది. ఇదే అదనుగా కేంద్రం రాయబారంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. పన్నీర్ కోరుకుంటున్నట్టుగా శశికళను, దినకరన్ ను పార్టీ పదవులన్నింటి నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకె నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వార్తలు: