అవును…కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థిని నేనే

rahul-gandhi-absolutely-ready-to-be-pm-candidate-for-2019

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాంగ్రెస్ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిత్వంపై రాహుల్ గాంధీ తొలిసారి నోరువిప్పారు. 15 సంవ‌త్స‌రాల నుంచి క్రియాశీల రాజ‌కీయాల్లో ఉంటున్న రాహుల్ గాంధీ భార‌త్ కు వెలుపల ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విపై మొద‌టిసారి త‌న మ‌న‌సులో మాట వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని రాహుల్ చెప్పారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండు వారాల యూఎస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ గాంధీ బ‌ర్కిలీలోని కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీలో విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఓ విద్యార్థి ప్ర‌ధానిగా పోటీచేస్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఔన‌ని స‌మాధాన‌మిచ్చిన రాహుల్ తాను పీఎం ప‌ద‌వికి పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని అయితే సంస్థాగ‌త పార్టీ అయిన కాంగ్రెస్ దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల ద్వారా రాహుల్ …వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రియాంక గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి అంటూ కాంగ్రెస్ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌కు ముగింపు ప‌లికిన‌ట్ట‌యింది.

2004లో తొలిసారి లోక్ స‌భ‌కు పోటీచేసిన రాహుల్ గాంధీని అప్ప‌ట్లో అంద‌రూ భ‌విష్య ప్ర‌ధాని అని పిలుచుకున్నారు. రాహుల్ త‌ప్ప‌కుండా పీఎం అవుతార‌ని కాంగ్రెస్ నేత‌లు, రాజ‌కీయ విమ‌ర్శ‌కులు అంద‌రూ భావించారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీనే పీఎం అంటూ ఆ ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ రెండోసారీ మ‌న్మోహ‌న్ సింగ్ కే అవ‌కాశ‌మిచ్చారు. త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి, దేశంలో రోజురోజుకూ కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డుతుండ‌టంతో రాహుల్ నాయ‌క‌త్వ సామ‌ర్థ్యంపై అంత‌ర్గ‌తంగా విస్తృత స్థాయి చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోడీ లాంటి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోటానికి రాహుల్ గాంధీ స‌రిపోర‌ని, ప్రియాంక‌గాంధీని ఎన్నిక‌ల బ‌రిలో నిల‌పాల‌ని చానాళ్ల నుంచి కాంగ్రెస్ లోని కొన్ని వ‌ర్గాలు సోనియాపై ఒత్తిడి తెస్తున్నాయి. రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషించ‌టానికి ప్రియాంక కూడా సిద్దంగా ఉన్నార‌ని, రేపో, మాపో ఆమె కాంగ్రెస్ లో కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కించుకోవ‌చ్చ‌న్న ప్ర‌చార‌మూ ఊపందుకుంది. ఈ త‌రుణంలో రాహుల్ గాంధీ తొలిసారి కాంగ్రెస్ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి అభ్య‌ర్థిని తానే అంటూ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నాయ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.

అటు కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీ ప్ర‌సంగంలో రాహుల్ అనేక అంశాల‌పై త‌న అభిప్రాయాలు వెల్ల‌డించారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై స్పందించిన రాహుల్ భార‌త్ లో ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని…ఇది ఒక్క రాజ‌కీయాలకే ప‌రిమితం కాద‌ని, సినిమా, వ్యాపారంతో పాటు అన్ని రంగాల్లో వార‌స‌త్వం కొన‌సాగుతోంద‌ని విశ్లేషించారు. త‌న‌ను మాత్రమే వార‌స‌త్వ‌రాజ‌కీయాల ప్ర‌తినిధిగా చూడొద్ద‌న్న రాహుల్ అన్ని రాజ‌కీయ పార్టీల్లోనూ ఇదే ప‌ద్ధ‌తి ఉంద‌ని, అఖిలేశ్ యాద‌వ్‌, స్టాలిన్ లాంటి వారు వార‌సత్వం ద్వారానే వెలుగులోకి వ‌చ్చార‌ని రాహుల్ అన్నారు. బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌, పారిశ్రామిక‌వేత్త‌లు అంబానీ సోద‌రులు కూడా వార‌స‌త్వాల వ‌ల్లే త‌మ త‌మ రంగాల్లో కొన‌సాగుతున్నార‌ని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇదో స‌మ‌స్యేన‌ని, అయితే ఇండియాలో అధికంగా జ‌రిగేది ఇదేన‌ని రాహుల్ అన్నారు. త‌న ప్ర‌సంగంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం పైనా, ప్ర‌ధాని మోడీపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ చేసిన ప‌నుల‌న్నింటినీ బీజేపీ త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని రాహుల్ ఆరోపించారు. త‌న‌క‌న్నా మోడీ మంచి వ‌క్త అని అంగీకరించిన రాహుల్ ఒక స‌మూహంలోని వేర్వేరు వ‌ర్గాల వారికి నప్పేలా సందేశం ఇచ్చే స‌త్తా మోడీకుంద‌ని, పై పై మెరుగుల్ని మాత్ర‌మే ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. తానుమాత్రం క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసుకుంటూ వెళ్తున్నాన‌ని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు:

ఈ ఏడు సూత్రాలు పాటిస్తే ఆనందం మీ సొంతం.

ముద్రగడ కి జగన్ తత్వం బోధపడిందా?