Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన రోజే వైసీపీ అధినేత జగన్ కి పెద్ద షాక్. ఆయన పేరు బ్రిటన్ రాణి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచరుల సరసన చేరిన వార్త ఆయనకి కంగారు పుట్టించింది. అలాంటి గొప్ప గొప్పోళ్ళ సరసన పేరు చేరితే సంతోషించాల్సింది పోయి టెన్షన్ పడటం ఎందుకని అనుకుంటున్నారా?. మ్యాటర్ అలాంటిది మరి.
ప్రపంచ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల సంస్థ నేడు అంతర్జాతీయ నల్ల ధన ప్రముఖులు జాబితాతో పాటు వారు అక్రమంగా సంపాదించిన ధనాన్ని పన్ను ఎగవెతకి వీలుగా ఏ ఏ దేశాల్లో ఎలాంటి లావాదేవీలకు ఉపయోగించారో బయటపెట్టింది. పారడైస్ పేపర్స్ పేరుతో ఆ సంస్థ మొత్తం కోటి 34 లక్షల రికార్డుల్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ఈ జాబితాలో బ్రిటన్ రాణి, ట్రంప్ ముఖ్య అనుచరులు కొందరితో పాటు ఇండియా కి చెందిన 714 మంది పేర్లు బయటికి వచ్చాయి. వీటిలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, వాటి అధినేతలు, ఇతర ముఖ్యులతో పాటు కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా వున్నాయి. వీరంతా అక్రమ సంపాదనతో ఆఫ్ షోర్ స్వర్గధామాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టారు, ఏ లావాదేవీలు నిర్వహించారు అన్నదానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే వీరిలో కొందరిపై ఈడీ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ జాబితాలో జగన్ పేరు కూడా ఉండటం వైసీపీ వర్గాల్లో కలకలం రేగుతోంది.
పాదయాత్ర మొదలైన రోజు అక్రమ ఆస్తులు, లావాదేవీల వ్యవహారంలో జగన్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతుంటే ఇక అధికార పక్షం నుంచి ఎదురయ్యే విమర్శలకి ఏ సమాధానం చెప్పాలా అని వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. వారు ఊహిస్తున్నట్టే ఈ అవకాశాన్ని తమకి అనువుగా మలుచుకోడానికి టీడీపీ నేతలు ఇప్పటికే నెట్ లో పారడైజ్ పేపర్స్ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.