ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి పరిటాల సునీతకు షాక్ తగిలింది. ముందు నుండీ అనుకుంటున్నట్టు గానే పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న తెలుగుదేశం పార్టీని వీడారు. నిన్న ఆయన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో రాజన్న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం జగన్ స్వయంగా రాజన్నకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతే కాక పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేపకుంట రాజన్న చేరికతో రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరుగుతుందని స్థానిక వైసీపీ నేతలు భావిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారని రాజన్న గత కొద్దిరోజులుగా విమర్శిస్తున్నారు. సునీత వైఖరితో పాటు చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదన్న కారణంతో నాలుగేళ్లుగా ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు.
నిజానికి ఈయన గత ఎన్నికల్లోనే రెబల్ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు, అయితే టీడీపీ ఆయనకు సముచిత స్థానం కలిపిస్తానని చెప్పి కల్పించకపోవడతో ఆయన అప్పటి నుండే తటస్థంగా ఉన్నారు. తాజాగా ఇటీవల తల్లిమడుగుల గ్రామంలో తన అనుచరులు, పలువురు టీడీపీ నాయకులతో కలసి సమావేశం నిర్వహించిన రాజన్న వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదనీ, అందువల్లే పేదలకు అండగా నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలిచేందుకు తన అనుచరుల కోరిక మేరకు త్వరలో వైసీపీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం పార్టీలో చేరారు. కడపలో వైసీపీ సమర శంఖారావం సభలో పాల్గొన్న జగన్ అనంతరం తిరిగి వెళ్తూ మార్గ మధ్యంలో కాన్వాయ్‌ను ఆపి రోడ్డు మీద రాజన్నకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.