గత కొద్దిరోజులుగా సాక్షి పత్రికలో అనంత తెదేపా యువనాయకుడు, మంత్రి పరిటాల సునీతల కుమారుడు పరిటాల శ్రీ రామ్ అరాచకాలు అంటూ కొన్ని కధనాలు ప్రచురిస్తోంది. ఆ విషయం మీద పరిటాల శ్రీ రాం స్పందించాడు ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో దురుద్దేశంతోనే వైఎస్సాఆర్సీపీ నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ హత్య, కిడ్నాప్ జరిగినా తనతో ముడిపెట్టడం రాజకీయంలో భాగంగానే చేస్తున్నారని కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్ తదితర ఘటనల వెనుక తన హస్తం లేదని అసలు కేఎన్ పాల్యలో చనిపోయిన అమ్మాయి పెళ్లికి మా ఇంటి నుంచే తాళిబొట్టు, చీర పంపామని అలాంటి ఆమెని మేమెందుకు చంపుకుంటామని శ్రీరామ్ పేర్కొన్నారు.
కిడ్నాప్‌లు, దందాలు తమ సంస్కృతి కాదని ఆరు నెలలుగా జిల్లాలోనూ, రాప్తాడు నియోజకవర్గంలోనూ పరిటాల శ్రీరామ్ అది చేశారు… ఇది చేశారంటూ ఓ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిటాల శ్రీరామ్‌ను ఓ భూతంగా చూపించి ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన తాను బాబాయిలా భావించే చమన్‌సాబ్ చనిపోతే… ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అయితే ఆయన మృతిపై కూడా వివిధ రూపాల్లో ఆరోపణలు చేస్తూ ఆ పత్రిక కథనాలు రాయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
ధర్మవరం కిడ్నాప్ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అయితే అందులో తన హస్తమున్నట్లు జిల్లాలోని తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రచారం చేయించారన్నారు. నాలుగేళ్ళుగా ఒక మంత్రి కొడుకుగానే ఉండి ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాననే సంకేతాల నేపథ్యంలోనే తనపై ఇలాంటి కుట్రలకు తెరలేపారని శ్రీరాం ఆరోపించారు. పరిటాల కుటుంబం రాప్తాడు, అనంతపురం జిల్లాకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారన్నారు. తమ వద్దకు ఎంతోమంది వస్తుంటారని, తమతో సెల్ఫీలు దిగుతుంటారన్నారు. అందులో ఎవరో తప్పు చేస్తే… తమ పై రుద్దడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
మీడియా కూడా వాస్తవాలు తెలుసుకుని కథనాలు ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎన్నో సమస్యలున్నాయని, కొంత మంది ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వాటిని బయట పెట్టాలని కోరారు. చివరికి తమ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా… భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.